ప్రాణాలు దైవాధీనం! | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు దైవాధీనం!

Aug 20 2025 5:51 AM | Updated on Aug 20 2025 5:51 AM

ప్రాణ

ప్రాణాలు దైవాధీనం!

ఓపీ కోసం గంటలకొద్దీ నిరీక్షణ వీల్‌ చైర్లు, స్ట్ట్రెచర్లులేక రోగుల ఇక్కట్లు పేరుకు మూడు లిఫ్టులున్నా మెట్లెక్కక తప్పని పరిస్థితి హౌస్‌ సర్జన్లతోనే పనికానిస్తున్న అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు చికిత్సంటే భయపడిపోతున్న సామాన్యులు అడుగడుగునా రాజకీయాలు

ఒక్క లిఫ్టుతో అవస్థలు..

ఒంగోలు టౌన్‌: జిల్లా కేంద్రమైన ఒంగోలులోని సర్వజన ఆస్పత్రి రోగుల సహనాన్ని పరీక్షిస్తోంది. పేరుకు పెద్దాస్పత్రి అయినా ఇక్కడ చికిత్స తీసుకోవాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సిందే. ఓపీ దగ్గర నుంచి వైద్యం చేయించుకునే వరకూ పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. అష్టకష్టాలుపడి ఓపీ తీసుకుని సంబంధిత డాక్టర్‌ గది దగ్గరకు వెళితే సీనియర్‌ వైద్యులు అందుబాటులో ఉండరు. మెడలో స్టెత్‌ వేసుకొని తిరుగుతున్న జూనియర్‌ వైద్యులతోనే పనికానిస్తుండడంతో రోగులు అసంతృప్తికి గురవుతున్నారు. మంచి డాక్టర్లు ఉన్నారంట అని చెప్పుకుంటుంటే విని ఎంతో దూరం నుంచి వచ్చిన రోగులకు పెద్ద డాక్టర్ల దర్శనభాగ్యం ఉండదు. అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులు ఎవరి వీల్‌ చైర్లు వారే తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఆస్పత్రి బయట అత్యవసర రోగుల కోసం స్ట్రెచర్లు ఉండవు. వీల్‌ చైర్లు ఉండవు. ఒకవేళ ఉన్నా రోగులను లోపలకు తీసుకెళ్లేందుకు సిబ్బంది ఉండరు. రోగుల సహాయకులే వీల్‌ చైర్లను తోసుకుంటూ వెళ్లాల్సి పరిస్థితులు నెలకొన్నాయి.

వేయి మందికి 16 కుర్చీలు

సర్వజన ఆస్పత్రికి ప్రతి రోజు 800 మంది నుంచి 1000 మందికి పైగా రోగులు వస్తుంటారు. సోమవారం, బుధవారం, శనివారం రోజుల్లో ఈ సంఖ్య 1200 లకు పైగానే ఉంటుంది. మద్దిపాడు, నాగులుప్పలపాడు, సంతనూతలపాడు, చీమకుర్తి, టంగుటూరు, సింగరాయకొండ ప్రాంతాల నుంచే కాకుండా జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న యర్రగొండపాలెం, దోర్నాల, పెద్దారవీడు, అర్థవీడు, కంభం, దొనకొండ, కురిచేడు ప్రాంతాల నుంచి కూడా చికిత్స కోసం రోగులు ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడకు వచ్చిన రోగులు మొదట అభా యాప్‌లో పేరు నమోదు చేసుకోవాలి. ఓటీపీ వచ్చాక ఓపీ కౌంటర్‌ దగ్గరకు వెళ్లాలి. ఈ ప్రక్రియ పూర్తవడానికి కనీసం గంటన్నరకు పైగానే పడుతుంది. అంతసేపు రోగులు ఎదురు చూస్తూ నిల్చోవాలి. ఇక్కడ వందల మంది రోగులకు కేవలం 16 కుర్చీలు, 6 బల్లలు మాత్రమే ఉన్నాయి. ఒక్కో బల్లమీద నలుగురు కూర్చోవచ్చు. అంటే మొత్తం మీద 40 మంది మాత్రమే కూర్చునే అవకాశం ఉంది. మిగిలిన వారంతా గంటల తరబడి నిలబడలేక నానా అవస్థలు పడుతున్నారు. అయినా జీజీహెచ్‌ అధికారులు పట్టించుకోవడంలేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స కోసం వచ్చే రోగులు మౌలిక వసతులు లేక అల్లాడిపోతున్నారు.

పారిశుధ్యం అధ్వానం

జీజీహెచ్‌లో పారిశుధ్యం లోపించింది. ఆస్పత్రిలోని మూడు అంతస్తుల్లో ఎక్కడా ఫినాయిల్‌తో శుభ్రం చేసినట్లు కనిపించదు. బాత్‌ రూంలు, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా దుర్గంధం వెదజల్లుతుంటాయి. కంట్రాక్టర్‌ ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడిన అధికారులు నాసిరకం ఫినాయిల్‌ వినియోగిస్తూ నెలనెలా లక్షల్లో బిల్లులు డ్రా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు బ్లీచింగ్‌ ఎక్కడ చల్లుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఆస్పత్రిలో దోమల బెడద ఎక్కువైపోయిందని, ఆరోగ్యం కోసం ఆస్పత్రికి వస్తే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుందని రోగులు వాపోతున్నారు. ఆస్పత్రికి గాయాలతో వచ్చే రోగులు చాలా ఎక్కువ. గాయాలను శుభ్రం చేసే గాజుగుడ్డ మరీ నాసిరకంగా ఉంటుందని, బెటాడిన్‌, హైడ్రోజన్‌ పెరాకై ్సడ్‌, స్పిరిట్‌లు మరీ నాణ్యతలేనివి వాడుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. రోగుల ఆరోగ్యం కంటే తమ చేతికి వచ్చే కమీషన్ల మీదనే అధికారులు దృష్టి పెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అడుగడుగునా రాజకీయమే...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీజీహెచ్‌లో అడుగడుగునా రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. కొంత మంది వైద్యులు, సిబ్బంది అధికార పార్టీకి చెందిన వారమంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రిలో రాజకీయాలేంటని రోగులు విమర్శిస్తున్నారు.

జీజీహెచ్‌లో పేరుకే మూడు లిఫ్టులు. ఓపీ కౌంటర్ల వద్ద ఉన్న ప్రధానమైన లిఫ్టు ఏడాదిగా పనిచేయడం లేదు. డయాలసిస్‌ సెంటర్‌ వద్ద ఉన్న లిఫ్టు నెల రోజులుగా మరమ్మతులకు గురైంది. ఇక మిగిలింది మెడికల్‌ ఓపీ దగ్గర ఉన్న లిఫ్టు మాత్రమే పనిచేస్తుంది. దాంతో ఎప్పుడు చూసినా ఈ లిఫ్టు దగ్గర రోగులు గుంపులు గుంపులుగా నిలబడి ఉంటున్నారు. ఒకేసారి 15 మందికి పైగా లిఫ్టు ఎక్కుతుండడంతో మధ్యలోనే ఎక్కడ ఆగిపోతుందోనని రోగులు ఆందోళన చెందుతున్నారు. లోడు ఎక్కువ కావడంతో ఇది కూడా దాదాపుగా చెడిపోయే పరిస్థితికి చేరుకున్నట్లు ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. గుండె జబ్బుల విభాగం మొదటి అంతస్తులోనే ఉంది. గుండె జబ్బులతో బాధపడే రోగులు లిఫ్టు ఎక్కే పరిస్థితి లేకపోవడంతో మెట్లు ఎక్కాల్సి వస్తోంది. దీంతో కొందరు రోగులు వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు. ఆస్పత్రి రెండు, మూడు అంతస్తుల్లో ఎంఐసీయూ, ఆర్‌ఐసీయూ, ఎన్‌ఐసీయూ, పీడీఐసీయూ, సర్జికల్‌ ఐసీయూలు ఉన్నాయి. మొత్తం మీద ఈ ఐసీయూల్లో 100 మందికి పైగా చికిత్స చేయించుకుంటున్నారు. అయినా అధికారులకు చీమకుట్టినట్టయినా లేదని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి లిఫ్టులు పనిచేయకపోయినా అధికారులు పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రాణాలు దైవాధీనం!1
1/1

ప్రాణాలు దైవాధీనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement