
అక్షరాస్యత పెంపొందించాలి
ఒంగోలు సబర్బన్: నిరక్షరాస్యులైన వయోజనులకు అక్షరాస్యతను పెంపొందించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. ఒంగోలు కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళవారం ఉల్లాస్–అక్షర ఆంధ్ర అక్షరాస్యతా కార్యక్రమంపై ఎంపీడీఓలు, ఎంఈఓలు, డీఆర్‌డీఏ–ఏపీఎంలు, డీడబ్ల్యూఎంఏ– ఏపీఓలు, నగరపాలక, మున్సిపల్ కమిషనర్లు, సిటీ మిషన్ మేనేజర్లకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి విజయవంతం చేయాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉల్లాస్–అక్షర ఆంధ్ర అక్షరాస్యతా కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, దీనికి సంబంధిత జిల్లా అధికాలందరూ తమ సహకారం, తోడ్పాటు అందించాలని కోరారు. 15–59 ఏళ్ల మధ్య నిరక్షరాస్యులైన వయోజనులకు ఉద్దేశించిన సాంకేతికత, వయోజన విద్య అందుబాటులోకి తెచ్చే కార్యక్రమమని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో స్వచ్ఛంద బోధకులుగా కనీసం పదో తరగతి విద్యార్హత ఉన్న వారు ఎవరైనా సరే 10 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇది స్వచ్ఛందంగా జరిపే కార్యక్రమమని తెలిపారు. ఉల్లాస్–అక్షర ఆంధ్ర అక్షరాస్యతా కార్యక్రమం గ్రామ స్థాయిలో విజయవంతం అయ్యేలా తగు సూచనలు, సలహాలు అందజేశారు. కార్యక్రమానికి వయోజన విద్యాశాఖ ఉపసంచాలకులు బి.జగన్మోహన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో వయోజన విద్యా శాఖ పర్యవేక్షకులు, అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారులు, గణాంక అధికారి, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీఆర్‌డీఏ పీడీ నారాయణ, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, డీపీఓ వెంకట నాయుడు, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాదుతో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.