
డిజిటల్ మైక్రో క్రెడిట్ ప్లాన్ ఆమోదించాలి
ఒంగోలు సబర్బన్: డిజిటల్ మైక్రో క్రెడిట్ ప్లాన్‌ను త్వరగా ఆమోదించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా బ్యాంకర్లకు సూచించారు. పొదుపు సంఘాల మహిళలకు రుణాల మంజూరుపై స్థానిక క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పరిస్థితిని డీఆర్‌డీఏ పీడీ నారాయణ కలెక్టర్‌కు వివరించారు. పొదుపు సంఘాల మహిళలు రుణాలను తిరిగి చెల్లించడంలో చురుగ్గా ఉన్నారన్నారు. గతంలో రుణాలు మంజూరు చేసేందుకు గ్రూపులోని సభ్యులంతా సంతకాలు చేసిన పత్రాలు బ్యాంకులకు సమర్పించేవారని, ఇప్పుడు బయోమెట్రిక్ వేలిముద్ర వేయటం ద్వారా గ్రూపు సభ్యులు తమ అంగీకారం తెలుపుతున్నారని వివరించారు. నూతనంగా ప్రవేశపెట్టిన ఈ విధానం ద్వారా మైక్రో క్రెడిట్ ప్లాన్స్‌ను బ్యాంకులు ఆమోదించడంలో కొంత జాప్యం జరుగుతున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్‌ను వచ్చే నెలలో ప్రభుత్వం ఇస్తుందన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా మైక్రో క్రెడిట్ ప్లాన్స్‌ను బ్యాంకర్లు ఆమోదిస్తే ఎంత మొత్తంలో పొదుపు సంఘాలకు రుణాలు అవసరమో ఒక అవగాహన వస్తుందని పీడీ నారాయణ చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ త్వరగా ఈ తాత్కాలిక డిజిటల్ అప్రూవల్స్‌ను ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. అందుకోసం బ్యాంకర్లు పొదుపు మహిళా గ్రూపులకు ఉదారంగా రుణాలు అందించాలన్నారు. ఈ విషయాల్లో బ్రాంచ్ మేనేజర్లకు అవగాహన కల్పించేలా గురు, శుక్రవారాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. బ్యాంకర్లకు ఏపీఎంలు కూడా అందుబాటులో ఉండేలా చూడాలని పీడీని ఆదేశించారు. డ్వాక్రా సంఘాల మహిళలు చేస్తున్న పొదుపు డబ్బుల్లో 75 శాతం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని, మిగిలిన 25 శాతం నగదు అంతర్గత రుణాలకు ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో ఎల్‌డీఎం రమేష్, బ్యాంకుల రీజినల్ మేనేజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇసుక డిపోలను విస్తృతంగా తనిఖీలు చేయాలి
జిల్లాలోని ఇసుక డిపోలను విస్త్రతంగా తనిఖీలు చేపట్టాలని గనులు, భూగర్భ శాఖ అధికారులను కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గనులు, భూగర్భ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇసుక డిపో యజమానులపై ఇసుక రవాణా చేసే వాహనదారులు, ట్రాన్స్‌పోర్టర్లు ఫిర్యాదులు చేస్తున్నారని ప్రస్తావించారు. రవాణాదారులను ఇసుక డిపో యజమానులు ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టాలన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిని సమగ్రంగా విచారించాలని ఆదేశించారు. ఖనిజ అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా గనులు, భూగర్భశాఖ అధికారులు టి. రాజశేఖర్, ఏం. విష్ణువర్ధన్, బి. రామచంద్ర, ఇతర గనులు, భూగర్భశాఖ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా