
మృత్యువులోనూ వీడని స్నేహం..
కనిగిరిరూరల్: ఒకరు సీనియర్, మరొకరు జూనియర్ అయినా వారిద్దరూ మంచి స్నేహితులు.. సరదాగా చెరువులో తెప్పపై వెళ్లిన ఇద్దరూ తెప్ప తిరగబడి నీటమునిగి ఒకేసారి మృత్యువాత పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. కనిగిరి పట్టణంలోని నక్కలతిప్పకు చెందిన బొందలపాటి ప్రవీణ్ కుమారుడు బొందలపాటి శివ ప్రసాద్ (19), శంఖవరంలోని ఏనుగంటి ఎర్రయ్య కుమారుడు ఏనుగంటి గౌతమ్ (18) ఇద్దరూ ఇంటర్మీడియెట్‌లో జూనియర్, సీనియర్‌లు. వీరిద్దరూ స్నేహితులు. గౌతమ్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతుండగా.. శివ ప్రసాద్ ఇంటర్ పూర్తయి సబ్జక్టులు మిగిలి ఉండటంతో ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం ఓ ప్రైవేటు టీచర్ దగ్గర ట్యూషన్‌కు వెళ్లిన గౌతమ్ రాత్రికి అక్కడే ఉన్నాడు. ఆదివారం ఉదయాన్నే ఆ ప్రైవేట్ ట్యూషన్ టీచర్ వద్ద బైక్ తీసుకుని శంఖవరంలోని ఇంటి దాకా వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. భైరవకోన జలపాతం చూసేందుకు వెళ్తున్నానని ఇంటిదగ్గర చెప్పి బయటికి వచ్చాడు. అనంతరం నక్కలతిప్ప వద్ద స్నేహితుడు శివప్రసాద్ ఇంటి వద్దకు వెళ్లి అతడిని బైక్‌పై ఎక్కించుకున్నాడు. అయితే వీరిద్దరూ పునుగోడు వద్ద రిజర్వాయర్ చెరువు వద్దకు వెళ్లారు. అక్కడున్న తెప్ప పడవను తీసుకుని సరదాగా లోపలికి వెళ్లారు. తెప్పను లోపల అదుపు చేసుకోలేకపోవడంతో అది తిరగబడింది. దీంతో వీరికి ఈత రాక ఇద్దరూ రిజర్వాయర్ నీటిలో మునిగి మృతి చెందారు. ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు పిల్లలు ఇంటికి తిరిగిరాకపోవడంతో మృతుల తల్లిదండ్రులు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో మంగళవారం పునుగోడు రిజర్వాయర్ వద్దకు వచ్చిన జాలర్లకు కట్ట దగ్గర తెప్ప కనపడకపోవడంతో మరో తెప్ప సాయంతో లోపలికి వెళ్లి చూడగా ఒక తెప్ప, యువకుల మృతదేహాలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై టీ శ్రీరాం ఘటనా స్థలానికి సిబ్బందితో వెళ్లి యువకుల మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, సీఐ ఖాజావలి, తహసీల్దార్ ఏవీ రవిశంకర్, ఇతర అధికారులు పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. చనిపోయిన యువకులిద్దరివీ నిరుపేద కుటుంబాలే. ఆ ఇళ్లకు వారిద్దరూ పెద్ద కుమారులే.
అనుమానం వ్యక్తం చేస్తున్న మృతుల తల్లిదండ్రులు:
రెండ్రోజుల నుంచి ఇద్దరు పిల్లల్లో ఒకరి ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ కావడం.. మరొక ఫోన్‌రింగ్ అయినా లిఫ్ట్ చేయకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల మృతదేహాలపై గాయాలు కూడా ఉన్నాయంటున్నారు. ఫోన్ లోకేషన్లపై పలు అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఫోన్ లొకేషన్లు కొంత సేపు సీఎస్‌పురం ప్రాంతంలో, కొద్దిసేపు కనిగిరి ప్రాంతంలో, మరికొంత సేపు మంత్రాలయం ఏరియాలో ఉన్నట్లు శివప్రసాద్ తండ్రి ప్రవీణ్ ఆరోపిస్తున్నాడు. తన కుమారుడి ఒంటిపై గాయాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల మరణం ప్రమాదవశాత్తు జరిగింది కాదని, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.
ఎస్సై శ్రీరాం ఏమంటున్నారంటే..
ఈ సందర్భంగా ఎస్సై టీ శ్రీరాం విలేకరులతో మాట్లాడుతూ భైరవకోన జలపాతం చూసేందుకు వెళ్తున్నట్లు చెప్పిన ఇద్దరు యువకులు పునుగోడు రిజర్వాయర్ వద్దకు వెళ్లారని..తెప్ప పడవ తీసుకుని రిజర్వాయర్‌లోకి దిగి తెప్ప బోల్తాపడటంతో నీటిలో మునిగి ఈతరాక మృతిచెందారన్నారు. మృతదేహాలను పరిశీలించగా ఎటువంటి గాయాలు లేవని, అయినా పోస్టుమార్టం నిర్వహించి ఎఫ్‌ఎస్‌ఎల్ (చనిపోయాక నీళ్లలో పడేశారా.. లేక నీళ్లలో పడిన తర్వాత చనిపోయారా అనేది నిర్ధారించే పరీక్ష) రిపోర్టు ప్రకారం తగు దర్యాప్తు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే సోమవారం పునుగోడు రిజర్వాయర్‌ను చూసేందుకు సీఎస్‌పురం మండలం సీతారాంపురానికి చెందిన కొందరు ముస్లిం కుటుంబాలు వచ్చాయన్నారు. వాళ్లకు మృతులకు సంబంధించిన ఫోన్లు దొరికాయని.. వాటిని సీఎస్‌పురం ఎస్సైకు అందజేశారన్నారు. అయితే మృతుల ఫోన్ నంబర్లు, ముస్లిం కుటుంబాల సెల్‌ఫోన్ నంబర్లు కూడా సీడీఆర్‌లో పెట్టి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బయటకు వద్దన్నా వినలేదు..
ఇంట్లో మీనాన్న లేరు.. నువ్వు బయటకు వెళ్లొద్దు..నాన్న వస్తే అరుస్తాడు అని ఎంత బతిమిలాడినా.. వినకుండా ఆదివారం కదా.. ఒక అరగంట ఊర్లోనే అలా బయట తిరిగి వస్తాను.. అని చెప్పి వెళ్లిన మనవడు శవంగా మారాడని మృతుడు బొందలపాటి శివ ప్రసాద్ నాయనమ్మ కన్నీరుమున్నీరైంది. చేతికి అందివచ్చిన కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు దుర్గ, ప్రవీణ్‌లు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తండ్రి ప్రవీణ్ స్టేజీ కళాకారుడు.. కార్యక్రమాల్లో పాటలు పాడి వచ్చిన డబ్బుతో పిల్లలను పోషించుకుంటున్నాడు. ఇద్దరు కుమారులు కాగా శివ ప్రసాద్ పెద్ద కుమారుడు.
ఇప్పుడే వస్తానని వెళ్లి..
వెంటనే తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన కుమారుడు.. శవమై తేలడంతో తల్లిదండ్రులు అంకమ్మ, ఎర్రయ్యలు చేసే రోదనలు మిన్నంటుతున్నాయి. కూలీ పనిచేసుకుని జీవించే ఆ కుటుంబంలో చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడంతో కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. గౌతమ్ చదువులో కూడా మంచి తెలివి గల వాడని బంధువులు తెలిపారు. పేదరికం కారణంతో ప్రైవేటు కళాశాల నుంచి ఇంటర్ రెండో సంవత్సరం ప్రభుత్వ కాలేజీలోకి మారినట్లు తెలిపారు. అంకమ్మ, ఎర్రయ్య దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు కాగా.. గౌతమ్ పెద్ద వాడు.

మృత్యువులోనూ వీడని స్నేహం..