
కూటమి పాలనలో ప్రజాసామ్యం ఖూనీ
ఒంగోలు సిటీ: పులివెందుల, ఒంటిమిట్టలో ఈ నెల 12న జరిగిన ఉప ఎన్నికలను చూస్తే సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే కాకుండా అపహాస్యం చేసినట్లు స్పష్టమవుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలు బ్రిటీష్ విధానాలను తలపిస్తున్నాయన్నారు. పోలింగ్ బూత్‌లలో వైఎస్సార్ సీపీ ఏజెంట్లు కూర్చోవడానికి కూడా వీల్లేకుండా చేయడం, ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా ఓట్లు కూడా వేయనివ్వకుండా హౌస్ అరెస్ట్‌లు చేయడం, పక్క నియోజకవర్గాల నుంచి టీడీపీ నాయకులను పిలిపించి ఓట్లు వేయించడం వంటి నియంతృత్వ విధానాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పి.. అధికారంలోకి రాగానే అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేసి ఉంటే ప్రజస్వామ్యబద్ధంగా ప్రజలను ఓట్లు అడిగేవారని, అలా కాకుండా ఓడిపోతామనే భయంతో పరువుపోతుందని పోలీస్ వ్యవస్థను, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను ఎన్నికల వద్ద నిలబెట్టి నానా రకాలుగా రిగ్గింగ్ చేసి భయాందోళనకు గురిచేశారని విమర్శించారు. ఇటువంటి ఎన్నికలను బర్తరఫ్ చేయాలన్నారు. మళ్లీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోందన్నారు. బీహర్‌లో గతంలో దౌర్జన్యాలు, అరాచకాలతో ఎలక్షన్ నిర్వహించే పరిస్థితి ఉండేది కాదని, ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని మరో బీహార్‌లా తయారు చేసి నానా రకాలుగా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలని కోరుకుంటున్నామని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి