
చంద్రబాబు అంటే గుర్తుకొచ్చేది వెన్నుపోటే
ఊకదంపుడు ప్రచారంతో మోసం చేయటమే ఆయన నైజం బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ సభలో ఎమ్మెల్యే తాటిపర్తి
పెద్దదోర్నాల: చంద్రబాబు పేరు చెపితే అందరికీ గుర్తుకు వచ్చేది వెన్ను పోటేనని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి తాడిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. మండల పరిధిలోని పెద్దబొమ్మలాపురం, యడవల్లిలలో బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు, ప్రచారాలతో ప్రజలను మోసం చేయటమే చంద్రబాబు నైజమన్నారు. ఆయన చేసిన తప్పుడు ప్రచారాలకు మద్దతు పలికిన మీడియా చానళ్లకు ఎన్నో లాభాలు, పదవులను అందించిన ఘనత చంద్రబాబు నాయుడిదేనన్నారు. అయిన వారిని అందలాలు ఎక్కించిన చంద్రబాబు నిరుపేదలకు మాత్రం పిడికిలిని విదిల్నిన పాపాన పోలేదన్నారు. గతంలో డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, రైతుల రుణాల మాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు అని వారికి ఏమీ చేయని ఘనత చంద్రబాబుదేనన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయమే దండగ అన్న పెద్దమనిషి ఆయనేనన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఎన్నో పథకాలను అందించారని చెప్పారు. పాఠశాలను ఆధునికీకరించటంతో పాటు, వైద్యం కోసం ఎన్నో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు. దీంతో పాటు 55 వేల వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగాలను భర్తీ చేశారని తెలిపారు. నేడు మండల కేంద్రంలోని సామాజిక అరోగ్య కేంద్రంలో 14 వైద్యుల పోస్టుల ఖాళీలున్నాయన్నారు. పెద్దదోర్నాల ఆర్టీసీ బస్టాండ్‌కు తమ ప్రభుత్వం ద్వారా డబ్బులు చెల్లిస్తే, ఆ బస్టాండ్‌ను ఆక్రమించుకోవాలని టీడీపీ నాయకులు చూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పెద్దబొమ్మలాపురం తూర్పుపల్లెలో అంగన్‌వాడీ స్కూల్ ఎదుట మడుగులా మారిన స్థలాన్ని, ట్యాంకు నుంచి లీకుకు గురై వెళుతున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం బొమ్మలాపురం బ్రహ్మంగారి గుడి వద్దనున్న గిరిజనులకు నీటి సమస్య, పక్కా గృహల సమస్యపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారితో మాట్లాడి వారి సమస్యలను వివరించారు. కార్యక్రమంలో నాయకులు సింగా ప్రసాద్, చిట్యాల వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీలు వెంకటరెడ్డి, రామనారాయణరెడ్డి, చిట్టె మల్లికార్జునరెడ్డి, వెన్నా పాండు రంగారెడ్డి, చిట్యాల వెంకటేశ్వరరెడ్డి, యక్కంటి శ్రీకాంత్‌రెడ్డి, పొందుగుల నాగమల్వేశ్వరి, అలుగుల లక్ష్మయ్య, మధు, రత్నరాజు, కొండా సురేష్, రావిక్రింది రామారావు, వెన్నా వెంకటేశ్వరరెడ్డి షెక్షావలి, లాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు.