చక్ర బంధం! | - | Sakshi
Sakshi News home page

చక్ర బంధం!

Aug 17 2025 6:07 AM | Updated on Aug 17 2025 6:07 AM

చక్ర

చక్ర బంధం!

బస్సులు రాక మహిళల అవస్థలు బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు విసుగు చెంది దొరికిన బస్సు ఎక్కేస్తున్న మహిళలు జిల్లాలో 500 గ్రామాలకు బస్సుల్లేవు దూర ప్రయాణాలు చేసే వారికి సరిపడా లేని ఎక్స్‌ప్రెస్‌ బస్సులు రూట్ల కుదింపుతో గ్రామీణ మహిళా ప్రయాణికుల ఇక్కట్లు శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఒంగోలు బస్టాండ్‌లో ఉన్న 15 బస్సుల్లో 8 వరకూ సూపర్‌ లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్‌ బస్సులే

మహిళలు లగ్జరీ బస్సులు ఎక్కకూడదా...

ఉచితం..

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూటమి ప్రభుత్వం సీ్త్ర శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించింది. రెండో రోజు శనివారం మహిళల నుంచి అంతంత మాత్రంగానే స్పందన కనిపించింది. ఒంగోలు, మార్కాపురం బస్టాండ్‌లు మినహా మిగతా ప్రాంతాల్లో రద్దీ కనిపించలేదు. కనిగిరి,గిద్దలూరు,యర్రగొండపాలెం, సంతనూతలపాడు, కొండపి, దర్శి నియోజకవర్గాల్లో బస్సులు ఖాళీగానే తిరిగాయి. ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే ఆర్భాటంగా ప్రారంభించింది కానీ అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమైందని మహిళా ప్రయాణికులు ఆరోపిస్తుండడం గమనార్హం. ఉచిత బస్సు పథకం ప్రారంభమైందికదా అని కండెక్టర్లను అడిగితే ఇంకా చార్ట్‌ రాలేదన్న సమాధానం వచ్చింది. దీంతో ఎంతో ఆశతో తొలిరోజే ఉచిత బస్సు ప్రయాణం చేయాలని ఆర్టీసీ బస్సు ఎక్కిన మహిళలు విస్తుపోయారు. జిల్లాలో అనేక రూట్లను కుదించడంతో ఆయా గ్రామాల మహిళలకు ఉచిత బస్సు ఉండీ ఉపయోగం లేకుండా పోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పొదిలి ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆర్‌ఎం సత్యనారాయణకు ఊహించని విధంగా ప్రయాణికుల నుంచి చుక్కెదురైంది. అసలే బస్సులు సరిగా లేవని, గంటల కొద్దీవేచి చూసినా బస్సులు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత బస్సుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని చెప్పారు. దాంతో ప్రయాణికులకు జవాబు చెప్పలేక ఆర్‌ఎం వెనుదిరిగారు.

500లకు పైగా గ్రామాలకు బస్సుల్లేవు..

జిల్లాలో 729 పంచాయతీలు ఉన్నాయి. శివారు కాలనీలతో కలుపుకొని 1823 గ్రామాలు ఉన్నాయి. ఇందులో దాదాపుగా 500 గ్రామాలకు పైగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ఒక్క ఒంగోలు పరిసర గ్రామాల్లో 60 నుంచి 100 గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపడం లేదు. ఏలూరివారిపాలెం, గుడిపాడు, బోడపాలెం, పిడతలపూడి రూట్లలో ఆర్టీసీ బస్సులు తిరగడంలేదు. మువ్వవారి పాలెంకు ఒకప్పుడు బస్సు సౌకర్యం ఉండేది. ఇప్పుడా సర్వీసును నిలిపివేశారు. ఇనుమలమోటూరు, గాజులపాలెం, రాయవారిపాలెం, అన్నంగి, బసవన్నపాలెం, చింతాయపాలెం గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఒంగోలు డిపో నుంచి టంగుటూరు మీదుగా కామేపల్లి వెళ్లే రూట్లో 10 గ్రామాలు ఉన్నాయి. వాటికి కూడా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. నిజానికిది మెయిన్‌ రూటు. ఈ రూటులో ప్రయాణికులు ఎక్కువగా తిరుగుతుంటారని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. టంగుటూరు నుంచి ఆలకూరపాడు, అనంతవరం గ్రామాలకు వెళ్లాలంటే ఆటోలే దిక్కు. కనపర్తిలో గతంలో 4 బస్సులు తిరిగేవి. ఇప్పుడు కేవలం ఒక్క బస్సు సర్వీసును మాత్రమే తిప్పుతున్నారు. పొదిలి నుంచి వయా మునగపాడు మీదుగా దొనకొండకు గతంలో 8 బస్సు సర్వీసులు తిరిగేవి. ఇప్పుడు ఒక్క బస్సు సర్వీసు కూడా లేకుండా తీసేశారు. ఇది కూడా రద్దీ బాగా ఉండే మెయిన్‌ రూటు కావడం విశేషం. కనిగిరి డిపో పరిధిలో గానుగపెంట, బడుగులేరు గ్రామాల రూట్లో అసలు బస్సులు తిరగడం లేదు. ఏరువారిపల్లి, పోలారం రూట్లలో కూడా ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరగడం లేదు. అడ్డరోడ్డు, నల్లారెడ్డిపల్లిలకు ఆర్టీసీ బస్సులు వెళ్లవు. అడ్డరోడ్డు లోపల ఉన్న 10 గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపడం లేదు. గిద్దలూరు మండలంలోని కొంగలవీడు, వేములపాడు, కొమ్మూనూరు, నల్లగట్ల, అంబవరం, వెళ్లుపల్లె, వెంగళరెడ్డి పల్లె, జయరామపురం, కంచిపల్లె, అంకిరెడ్డి పల్లె, ఓబులాపురం, వెంకటాపురం, బురుజుపల్లి గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడపడం లేదు. కొమరోలు మండలంలో చింతలపల్లె పంచాయతీలోని అన్నీ గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లవు. మండలంలోని మరో 17 గ్రామాలకు కూడా బస్సులు నడపడం లేదు. అర్ధవీడు మండలంలోని అంకభూపాలెం, ఇందిరానగర్‌, నారాయణ పల్లె, వీరభద్రాపురం, అయ్యావారిపల్లి గ్రామాలకు ఆర్టీసీ బస్సులు లేవు. బేస్తవారిపేట చెన్నుపల్లె, బాలేశ్వరపురం, రాచర్ల మండలంలోని 10 గ్రామాలకు, కంభం మండలంలోని రావిపాడు, ఎల్‌ కోట, లింగోజిపల్లి గ్రామాలకు బస్సులు లేవు. మార్కాపురం పరిధిలో 34 గ్రామాలకు బస్సులు లేవు. ఈ గ్రామాలకు చెందిన మహిళలు ఉచిత బస్సు ఎక్కాలంటే ఆటోలో మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల మండల కేంద్రాలకు వచ్చి ఎక్కాల్సి ఉంటుంది. ఉచిత బస్సు సౌకర్యం జిల్లాలోని ప్రజలందరికీ అందుబాటులో లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

పుణ్యక్షేత్రాలకు ఉచితం లేనట్లే..

జిల్లా నుంచి వందలాది భక్తులు నిత్యం తిరుపతి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, శ్రీకాళహస్తి వెళుతుంటారు. అయితే ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్లాలంటే ఎక్స్‌ప్రెస్‌ బస్సులు చాలా తక్కువ. అధిక శాతం సూపర్‌ లగ్జరీ, అల్ట్రాడీలక్స్‌ బస్సులు మాత్రమే ఉన్నాయి. దీంతో భక్తులు తప్పనిసరిగా టికెట్టు కొని ప్రయాణాలు చేయాల్సిందే. జిల్లాలో కూడా మాలకొండ, భైరవకోన, శింగరకొండ తదితర ఆధ్యాత్మిక కేంద్రాలకు బస్సు సౌకర్యం లేదు. దాంతో ఉచిత ప్రయాణం చేయాలన్నా ఆ అవకాశం లేదు. రాయలసీమ నుంచి కొత్తపట్నం, కరేడు, రామాయపట్నం బీచ్‌లకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. నేరుగా ఇక్కడకు వెళ్లడానికి కూడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఉచిత బస్సు సౌకర్యం ఉన్నా ఉపయోగపడే అవకాశం లేదని చెబుతున్నారు.

బస్సుల కోసం మార్కాపురం బస్టాండులో వేచిచూస్తున్న మహిళలు

2

1

1

2

ఉచిత బస్సు సౌకర్యం కేవలం పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు మాత్రమే పరిమితం చేశారు. జిల్లాలోని ఒంగోలు ఆర్టీసీ డిపోలో సూపర్‌ లగ్జరీ, ఆల్ట్రాడీలక్స్‌, 4 ఏసీ బస్సు సర్వీసులు ఉన్నాయి. జిల్లాలోని మిగతా 4 డిపోలను కలుపుకొని మొత్తం 10 వరకు ఏసీ బస్సులు ఉన్నాయి. దూరప్రాంతాలకు వెళ్లే వారు, అనారోగ్యంతో బాధపడే వారు సహజంగా ఏసీ బస్సుల్లో ప్రయాణం చేయాలనుకుంటారు. అయితే ఉచిత బస్సు పథకంలో ఏసీ బస్సులను అనుమతించలేదు. మహిళలు ఏసీ బస్సులు ఎక్కడానికి అనర్హులా అని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అలాగే సూపర్‌ లగ్జరీ, అల్ట్రాడీలక్స్‌ సర్వీసుల్లో కూడా అనుమతించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌.. శనివారం మధ్యాహ్నం 12.30.. కనిగిరి వైపు వెళ్లే ప్లాట్‌ఫాం వద్ద పెద్ద ఎత్తున మహిళలు బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు గంటసేపటి నుంచి పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల కోసం నిరీక్షించారు. ఇక వేచిచూసే ఓపికలేక చాలా మంది మహిళలు అప్పుడే వచ్చిన అల్ట్రాడీలక్స్‌ బస్సు ఎక్కేశారు. మరి కొందరు మాత్రం బస్సుల కోసం ఎదురు చూశారు. ఒంటిగంట సమయంలో ఎక్స్‌ప్రెస్‌ బస్సు వచ్చింది. 12.30 గంటల సమయంలో సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్‌లో 15 బస్సులు ఉండగా అందులో 8 సూపర్‌ లగ్జరీ, ఆల్ట్రాడీలక్స్‌, ఇంద్రా సర్వీసులు ఉన్నాయి.

సీ్త్రశక్తి పేరుతో కూటమి ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవస్థల యానంగా మారింది. కేవలం ఐదు రకాల బస్సులకు మాత్రమే అనుమతినిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించవచ్చు అంటూ ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, నాయకులు చేస్తున్న హడావుడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలోనే హంసపాదన్నట్లు తొలిరోజే కొన్ని రూట్లలో మహిళలు టికెట్టు తీసుకొని ప్రయాణించాల్సి వచ్చింది. ఉచిత బస్సు పథకం ప్రారంభమైందికదా అని కండెక్టర్లను అడిగితే ఇంకా చార్ట్‌ రాలేదన్న సమాధానం వచ్చింది. దీంతో ఎంతో ఆశతో తొలిరోజే ఉచిత బస్సు ప్రయాణం చేయాలని ఆర్టీసీ బస్సు ఎక్కిన మహిళలు విస్తుపోయారు. ఉచిత బస్సు కోసం మహిళలు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. జిల్లాలో దాదాపు 500 గ్రామాలకు బస్సు సర్వీసులు లేకపోవడం గమనార్హం.

చక్ర బంధం!1
1/3

చక్ర బంధం!

చక్ర బంధం!2
2/3

చక్ర బంధం!

చక్ర బంధం!3
3/3

చక్ర బంధం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement