
గొప్పనేత సర్దార్ గౌతు లచ్చన్న
ఒంగోలు వన్‌టౌన్: సర్దార్‌గా ఖ్యాతి గడించిన స్వాతంత్య్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల పెన్నిధి, రైతు బాంధవుడు, కార్మిక శ్రేయోభిలాషి అయిన గొప్ప నేత సర్దార్ గౌతు లచ్చన్న అని బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఎం వెంకటేశ్వరరావు అన్నారు. గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలను ఒంగోలు బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంకితభావంతో ఎన్నో ఉద్యమాలు నడిపిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కార్యదక్షత, ఉక్కు సంకల్పం వలనే ఆయనకు సర్దార్ అనే పేరు వచ్చిందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎగిసిపడిన రాజకీయ కెరటమన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పదవులను సైతం త్యాగం చేశారని చెప్పారు. ఈ సందర్భంగా గౌతు లచ్చన్న చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నిర్మలా జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు: జిల్లా స్థాయి యోగాసన పోటీలు ఈనెల 17న స్థానిక అంజయ్య రోడ్డులోని ఏకేవీకే విద్యాకేంద్రం ఆవరణలో నిర్వహిస్తున్నట్లు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ప్రకాశం అధ్యక్ష, కార్యదర్శులు బోయపాటి రవి, సోమ సుబ్బారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రెడిషనల్, ఆర్టిస్టిక్ సోలో, ఆర్టిస్టిక్ పెయిర్, రిథమిక్ పెయిర్ విభాగాల్లో పోటీలు ఉంటాయి. 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు సబ్ జూనియర్స్, 14పైన 18 మధ్య వయస్సు ఉన్నవారు జూనియర్స్, 18పైన 28 మధ్యవయస్సు ఉన్నవారు సీనియర్స్‌గా పరిగణిస్తారు. 28 ఏళ్లకు పైబడిన వారికి ట్రెడిషనల్ యోగాసనాల్లో మాత్రమే పోటీలు ఉంటాయి. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 7780680121 లేదా 9490163312 లను సంప్రదించాలని అధ్యక్ష, కార్యదర్శులు బోయపాటి రవి, సోమ సుబ్బారావు పేర్కొన్నారు.
బేస్తవారిపేట: స్థానిక త్రిలోక పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బండలాగుడు పోటీలు నిర్వహించారు. గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన పమిడి అంజయ్య చౌదరి ఎడ్లు 3752 అడుగుల దూరం లాగి మొదటి స్థానంలో నిలిచాయి. కంభం మండలం దరగకు చెందిన సిద్దన కళ్యాణ్ ఎడ్లు 3750 అడుగులు, వైఎస్సార్ జిల్లా పాలూరుకు చెందిన కే హేమలతారెడ్డి ఎడ్లు 3500 అడుగులు, బేస్తవారిపేట మండలం బసినేపల్లెకు చెందిన వెనిగండ్ల శ్రీనివాసులు ఎడ్లు 3500 అడుగులు, పల్నాడు జిల్లా బయ్యవరానికి చెందిన కడియం మణికంఠ ఎడ్లు 3455 అడుగులు, గిద్దలూరు మండలం అక్కలరెడ్డిపల్లె కుతుర్ల దీక్షిత్‌రెడ్డి, నిశాంత్‌రెడ్డి ఎడ్లు 3269, పల్నాడు జిల్లా అడవిపాలెం పొకల శ్రీనివాసులు ఎడ్లు 3255, రాచర్ల మండలం అక్కపల్లె మండలం బత్తుల భూపాల్ ఎడ్లు 3051, ప్రకాశం జిల్లా గురువారెడ్డిపాలేనికి చెందిన వాకా సుబ్బారెడ్డి ఎడ్లు 3 వేల అడుగులు, అవుకు మండలం సంకేసులకు చెందిన సగబాలి ఆంతోనమ్మ ఎడ్లు 3 వేల అడుగుల దూరం లాగి వరుసగా ఒకటి నుంచి పది స్థానాల్లో నిలిచాయి. గెలుపొందిన ఎడ్ల యజమానులకు మొదటి పది బహుమతులు వరుసగా రూ.20 వేలు, రూ.16 వేలు, రూ.12 వేలు, రూ.10 వేలు, రూ.8 వేలు, రూ.6 వేలు, రూ.4 వేలు, రూ.3, రూ.2500, రూ.2 వేలను దాతలు అందజేశారు.