
యూరియా 3 బస్తాలిస్తే ఎలా?
కంభం: పంటల సేద్యానికి అవసరమైన ఎరువులను ప్రభుత్వం సకాలంలో అందించలేకపోవడంపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన యూరియాలో పది శాతం కూడా స్టాక్ రాకపోవడం.. వచ్చిన కొద్దిపాటి యూరియా కూడా గంటల వ్యవధిలోనే అయిపోతుండటంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతు సేవా కేంద్రంలో రూ. 266కు లభించే యూరియా బయట మార్కెట్‌లో రూ.350 నుంచి రూ.450కు విక్రయిస్తుండటంతో రైతులు కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. కంభం మండలంలో 8 రైతు సేవా కేంద్రాలుండగా ఎప్పుడు ఎక్కడ యూరియా అందుబాటులో ఉంటుందో తెలియని పరిస్థితి. కంభం రైతు సేవా కేంద్రంలో శుక్రవారం 240 బస్తాల యూరియా రాగా మధ్యాహ్నానికే అది ఖాళీ అయిపోయింది. ఒక్కో రైతుకు కేవలం మూడు బస్తాలు మాత్రమే ఇస్తుండటంతో అది సరిపోదని రైతులు గగ్గోలు పెట్టారు. కూటమి నాయకుల మితిమీరిన జోక్యంతో చాలా మంది రైతులకు ఆ 3 బస్తాల యూరియా కూడా దక్కలేదు. శుక్రవారం కంభం రైతు సేవా కేంద్రంలో యూరియాను టీడీపీ నాయకులు చెప్పిన వారికే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 240 బస్తాల యూరియా మధ్యాహ్నానికే అయిపోవడంతో మిగిలిన రైతులు వెనక్కు వెళ్లిపోయారు.