
సమస్యా భరితమే!
సముచితం కాదు..
కనిగిరిరూరల్: రాష్ట్రమంతటా ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఎన్నికల వేళ ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం షరతులు, పరిమితులతో తుస్సుమనిసించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని గొప్పగా చెబుతున్న కూటమి సర్కారు అటు అక్కచెల్లెమ్మలనే కాదు ఇటు అద్దె బస్సుల యజమానులనూ నిరుత్సాహంలోకి నెట్టింది. ఆర్టీసీలో తొమ్మిది రకాల సర్వీసులు ఉన్నప్పటికీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి జిల్లాలో అల్ట్రా పల్లె వెలుగు సర్వీసులు వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయిలోనూ లేకపోవడం గమనార్హం.
బస్సులు గుల్లవుతాయ్..
ఉచిత ప్రయాణానికి నిర్ణయించిన పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో 35 నుంచి 40 శాతం వరకు అద్దె(హైర్) బస్సులున్నాయి. అయితే వీటి యజమానులు ఉచితం మాటున తమకు జరిగే నష్టాన్ని ఊహించుకుని తీవ్ర ఆలోచనలో పడి ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఒంగోలు డిపోలో సుమారు 50, కనిగిరి డిపోలో 27, మార్కాపురం డిపోలో 22, పొదిలి డిపోలో 20 వరకు హైర్ బస్సులు.. వెరసి 4 డిపోల పరిధిలో 120 వరకు అద్దె బస్సులున్నాయి. వీటిని పూర్తిగా మహిళల ఉచిత ప్రయాణానికి వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కనిగిరి డిపోలో మొత్తం 107 బస్సులు ఉండగా, ఉచిత ప్రయాణానికి కేటాయించిన 47 బస్సుల్లో సగం అద్దెవే కావడం గమనార్హం. హైర్ బస్సుల్లో పల్లె వెలుగు సీటింగ్ సామర్థ్యం 55 నుంచి 60 మంది వరకు, ఎక్స్ ప్రెస్‌ల్లో 45 నుంచి 50 మంది వరకు ఉంటుంది. లీటర్ డీజిల్‌కు 5 నుంచి 6 కిలోమీటర్లు ప్రయాణించాలి. ప్రయాణికుల రద్దీ పెరిగితే బస్సుల మైలేజ్ పడిపో‘వడమే కాకుండా మెయింటెనెన్స్ ఖర్చు పెరుగుతుంది. మైలేజ్ షార్టేజ్ వస్తే ఆ భారాన్ని యజమానులే భరించాలన్నది నిబంధన. ఈ నేపథ్యంలో అద్దె బస్సుల నిర్వహణ తలకు మించిన భారంగా మారుతుందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీతో కుదుర్చుకున్న అగ్రిమెంట్‌లో ‘ఉచిత ప్రయాణం’ ప్రస్తావనే లేదని, దీనిపై చర్చించాల్సి ఉందని కొందరు యజమానులు చెబుతున్నారు. ఇన్ని సమస్యల నడుమ ‘మహిళల ఉచిత బస్సు ప్రయాణం’కు అద్దె బస్సుల యజమానులు ఏమాత్రం సహరిస్తారో వేచి చూడాల్సిందే. ప్రణాళికాబద్ధంగా లేని సీ్త్ర శక్తి పథకం ఆరంభశూరత్వమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
మహిళకు ఉచిత ప్రయాణంపై హైర్ బస్సుల యాజమానులు హడల్
రద్దీ పెరిగి బస్సులు దెబ్బతింటాయని ఆందోళన
ఫ్రీ బస్సుల్లో 40 శాతం అద్దె ప్రాతిపదికన తిప్పేవే..
జిల్లాలో 4 డిపోల్లో సుమారు 120 హైర్ బస్సులు