
సమన్వయంతో పనిచేయండి.. పన్ను పరిధిని విస్తరించండి
● జీఎస్టీ వసూళ్లపై సమీక్షలో కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: గూడ్స్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్‌టీ) కోసం ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయంలో కమర్షియల్ ట్యాక్స్, ఇతర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రూ.40 లక్షల టర్నోవర్(వస్తువుల విషయంలో), రూ.20 లక్షల టర్నోవర్(సేవల విషయంలో) దాటిన వ్యాపార సంస్థలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. పన్ను బకాయిదారుల ఆస్తుల వివరాలను కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి అందజేయాలని జిల్లా రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పన్ను ఎగవేతదారులపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. రూ.2.5 లక్షల విలువకు మించిన సరఫరా ఒప్పందాలపై టీడీఎస్ మినహాయించి జీఎస్‌టీఆర్–7 ద్వారా ప్రభుత్వానికి చెల్లించాలన్నారు. పన్ను లేకుండా గ్రానైట్, ఇతర సరుకుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రవాణా, మైనింగ్ శాఖలు కమర్షియల్ ట్యాక్స్ విభాగంతో కలిసి పనిచేయాలని సూచించారు. రూ.10 లక్షల వార్షిక టర్నోవర్ దాటిన వ్యాపార సంస్థలు, డాక్టర్లు, ఆర్కిటెక్టులు ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ వై.కిరణ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఎం.సత్య ప్రకాష్, ఒంగోలు–1, ఒంగోలు–2, మార్కాపురం సర్కిళ్ల అసిస్టెంట్ కమిషనర్లు, మైన్స్ డీడీ రాజశేఖర్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటేశ్వర రావు, డీఈఓ కిరణ్ కుమార్, డీటీసీ ఆర్.సుశీల ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.