
ఉద్యోగులకు 12వ పీఆర్సీ ప్రకటించాలి
● ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్
ఒంగోలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) జిల్లా అధ్యక్షుడు చిన్నపురెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో సంఘ జిల్లా కార్యదర్శి గోపీకృష్ణ ఆధ్వర్యంలో ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సంఘ కోశాధికారి రంగారెడ్డి, ఒంగోలు టౌన్ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు రజిత మానస, రోడ్డు భవనాల శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆటో బోల్తా.. మహిళ మృతి
● మరో ఏడుగురికి గాయాలు
సంతనూతలపాడు(చీమకుర్తి రూరల్): వేగంగా వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఒక వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. తాళ్లూరు నుంచి ఒంగోలు వస్తున్న ప్యాసింజర్ ఆటో పేర్నమిట్ట చెరువు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒంగోలు ముంగమూరు రోడ్డులో నివసిస్తున్న ఒడ్డువానికుంట గ్రామానికి చెందిన సండ్ర కోటమ్మ(65) అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో స్వల్పగాయాలైన నలుగురిని జీజీహెచ్‌కు, తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఒంగోలు తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.