
బోగస్ కంపెనీలకు భూములు కట్టబెట్టారు
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య
ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని ఖరీదైన భూములను ముఖ్యమంత్రి చంద్రబాబు బోగస్ కంపెనీలకు కట్టబెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. స్థానిక మల్లయ్య లింగం భవన్లో సీపీఐ రాష్ట్ర మహాసభల కరపత్రాలను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ కంపెనీనైతే బోగస్ కంపెనీ అంటూ ఆరోపణలు చేశారో అధికారంలోకి వచ్చిన తరువాత అదే కంపెనీకి కరేడు భూములను కట్టబెట్టడం చంద్రబాబు ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. విశాఖపట్నంలో 99 పైసలకే రూ.420 కోట్ల విలువ చేసే ఎకరా భూమిని కట్టబెట్టారని విమర్శించారు. ఏడాదికి మూడు పంటలు పండే వందల ఎకరాల భూములను సూట్‌కేస్ కంపెనీలకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. 53 వేల ఎకరాల్లో అమరావతి నిర్మాణం అని చెప్పిన చంద్రబాబు నేడు లక్ష ఎకరాలను ఎవరి ప్రయోజనాల కోసం సేకరిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అమరావతికి కేవలం 40 కిలోమీటర్ల దూరం ఉన్న గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయకుండా 33 కిలో మీటర్ల దూరంలో మరో ఎయిర్ పోర్టు నిర్మించేందుకు 56 ఎకరాలను సేకరించడం వెనక మతలబేమిటో చెప్పాలన్నారు. మదనపల్లి హేచరీలో ఎయిర్ పోర్టు నిర్మించి దొంగబాబా రాందేవ్‌కు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ, అమిత్ షాలతో కలిసి దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని విమర్శించారు. పీ4 పేరుతో చంద్రబాబు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. ఆర్థిక, సామాజిక మూలాల్లో మార్పు తీసుకొని రాకుండా పేదరికం రూపుమాపడం సాధ్యం కాదన్నారు. సీపీఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా వెయ్యి మంది కళాకారులు, 100 పాటలతో, 100 డప్పులతో 100 కళారూపాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 23వ తేదీ భారీ ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.