
అనధికార లేఔట్ల క్రమబద్ధీకరణకు అవకాశం
ఒంగోలు సబర్బన్: అనధికార లేఔట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఎల్‌ఆర్‌ఎస్ మంచి అవకాశమని ఒడా వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్‌పై సర్వేయర్లతో పాటు క్రెడాయ్, నారెడ్కో, బై, కాన్ఫెడరేషన్ ఆఫ్ లైసెన్స్‌డ్ ఇంజినీర్స్, సర్వేయర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్, ఆర్కిటెక్ట్స్ అండ్ లైసెన్స్‌డ్ ఇంజనీర్స్ అసోసియేషన్, ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్స్, వెల్ఫేర్ అసోసియేషన్స్, ఎన్‌జీఓస్, ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్స్, ఇతర భాగస్వామ్య సంస్థల ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30.06.2025కి ముందుగా వేసిన అనధికార లేఔట్లలో ప్లాట్లను చట్టబద్ధం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప అపరాధ రుసుంతో ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా అవకాశం కల్పించిందని చెప్పారు. జూలై 26వ తేదీ నుంచి 45 రోజుల్లోగా పూర్తి రుసుం చెల్లిస్తే 10 శాతం రాయితీ, 45 రోజుల తర్వాత 90 రోజుల్లోపు చెల్లిస్తే 5 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అక్టోబర్ 24వ తేదీలోగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు. సమావేశంలో ఒడా ప్లానింగ్ ఆఫీసర్ బాబూరావుతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.