
హత్యాయత్నం కేసులో నిందితుడు అరెస్టు
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ నాగరాజు
మార్కాపురం టౌన్: మార్కాపురం ఆర్టీసీ డిపోలో ఈనెల 11వ తేదీన ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన బండి బాపిరెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడైన క్రిష్టిపాటి వెంగళరెడ్డిని ఇక్కడి కారు స్టాండు వద్ద అరెస్టు చేసినట్లు డీఎస్పీ డాక్టర్ నాగరాజు తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో సీఐ పి.సుబ్బారావుతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈదర గ్రామానికి చెందిన బండి బాపిరెడ్డి, క్రిష్టిపాటి వెంగళ్‌రెడ్డి మధ్య పాతకక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో వెంగళరెడ్డి కుమారుడు కొండారెడ్డి హత్యకు గురికాగా బాపిరెడ్డిపై కేసు నమోదైంది. మార్కాపురంలోని జిల్లా ఆరో అదనపు న్యాయస్థానంలో కేసు విచారణలో ఉంది. తన కుమారుడిని కళ్లెదుటే చంపడాన్ని జీర్ణించుకోలేకపోయిన వెంగళరెడ్డి.. ఎక్కడో ఉంటూ కోర్టుకు హాజరవుతున్న బాపిరెడ్డిని హతమార్చేందుకు పథకం రచించాడు. ఈనెల 11న బాపిరెడ్డి కోర్టుకు హాజరై బ్రహ్మంగారిమఠం వెళ్లేందుకు బస్సులో ఎక్కి కూర్చున్నాడు. వెంగళరెడ్డి తనను ఎవరూ గుర్తుపట్టకుండా ప్యాంటు, షర్టు ధరించి, ముఖానికి మాస్కు పెట్టుకుని బస్సులో కూర్చుని ఉన్న బాపిరెడ్డి కళ్లలో కారం కొట్టాడు. అప్రమత్తమైన బాపిరెడ్డి గట్టిగా కేకలు వేస్తూ కిందకు దిగడం, స్థానికులు గుమిగూడటంతో వెంగళరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాపిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పట్టణ, రూరల్ ఎస్సైలు సైదుబాబు, అంకమరావుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 12 వెంగళరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు.