
బాలిక కిడ్నాప్ కలకలం
రాచర్ల/పెద్దారవీడు: పాఠశాలకు వెళ్లిన బాలికను గుర్తుతెలియని వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. పోలీసుల గాలింపు ఎక్కువ కావడంతో భయపడి పక్క మండలంలోని ఓ డంపింగ్ యార్డ్ వద్ద వదిలేసి వెళ్లిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు రాచర్ల మండలం అనుమలవీడు గ్రామానికి చెందిన మూడుమంచు గురుఅంజలి(8) అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. ఉదయం 8 గంటలకు తండ్రి పాపయ్య తన కుమార్తె గురుఅంజలికి పాఠశాలలో వదిలి పెట్టి వచ్చాడు. అప్పటికే గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాల సమీపంలోని రోడ్డు పక్కనే కారును నిలుపుకున్నారు. గం.8:25 కు గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాల లోపలికి వచ్చి గురుఅంజలి పేరు పెట్టి పిలిచి కారులో మీ నాన్న ఉన్నాడు పిలుస్తున్నాడు రావాలని బయటికి తీసుకెళ్లి బలవంతంగా బాలికను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. పాఠశాలలో బాలిక కనబడకపోవడంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పాఠశాలలో వంట చేసే వారు గుర్తుతెలియని వ్యక్తులు కారులో తీసుకుని వెళ్లారని చెప్పడంతో వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్.రఫీ ఉదయం గం.10:30 స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వెంటనే గిద్దలూరు రూరల్ సీఐ జే.రామకోటయ్య, ఎస్సై పి.కోటేశ్వరరావు పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. తెలుపు అండ్ సిల్వర్ రంగు కారులో గుర్తుతెలియని వ్యక్తులు గురుఅంజలిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని తెలియడంతో పోలీసులు అనుమలవీడు టూ సోమిదేవిపల్లె, సంగపేట వయా బేస్తవారిపేట మండలం, జగ్గంబొట్లకృష్ణపురం వరకూ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని అన్ని పోలీస్‌స్టేషన్లకు సమాచారం పంపించి అప్రమత్తం కావడంతో తాము దొరికిపోతామని భావించిన కిడ్నాపర్లు బాలికను పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామం సమీపంలో డంపింగ్ యార్డు వద్ద వదిలి వెళ్లిపోయారు. అక్కడే రోడ్డు పక్కన ఒంటరిగా నిల్చొని వచ్చిపోయే ద్విచక్ర వాహనదారులను ఆపాలని కేకలు పెడుతూ ఏడుస్తోంది. అదే సమయంలో మార్కాపురం నుంచి ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై దోర్నాలకు వెళ్తుండగా వారిని బండి ఆపాలని బాలిక కోరింది. తనను ఎవరో ఇక్కడ వదిలేసి వెళ్లారని ఏడుస్తూ చెప్పింది. దీంతో వారు పెద్దారవీడు హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావుకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, బాలికను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ నుంచి బాలికను పెద్దారవీడు ఎస్సై రాజుమోహన్‌రావు, ఏఎస్సై సుబ్బయ్య అనుమలవీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తీసుకొచ్చి మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు సమక్షంలో బాలిక తల్లిదండ్రులైన పాపయ్య, రాజేశ్వరిలకు అప్పగించారు. కారులో ముగ్గురు యువకులు ఉన్నట్లు బాలిక పోలీసులకు తెలిపింది.
పోలీసులు గాలిస్తుండటంతో బాలికను వదిలేసిన కిడ్నాపర్లు