
విచారణకు హాజరైన రామ్‌గోపాల్ వర్మ
ఒంగోలు రూరల్ సీఐ ఎదుట విచారణకు హాజరైన వర్మ
11 గంటల పాటు విచారణ
ఒంగోలు టౌన్: సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను ఒంగోలు రూరల్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించి.. వెంటనే ఆయనను బెయిల్‌పై విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన దర్శకత్వంలో రూపొందించిన వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ చిత్రాలను మార్ఫింగ్ చేసి ట్విట్టర్‌లో పెట్టారని ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో కేసు నమోదు చేసింది.
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ నేత ముత్తెన రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్మపై కేసు నమోదైంది. వర్మ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తొలిసారిగా ఆయన ఫిబ్రవరిలో పోలీసు విచారణకు హాజరయ్యారు. ఈ నెల 5న మరోసారి విచారణకు హాజరుకావాలని కోరుతూ జూలై 22న పోలీసులు వాట్సప్ మెసేజ్ పంపించినట్టు సమాచారం. అయితే తాను షూటింగుతో బిజీగా ఉన్నందున 12న విచారణకు వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మంగళవారంరూరల్ సీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 11.30 గంటలకు విచారణ మొదలవగా రాత్రి 10 గంటల వరకు సుమారు 11 గంటలకు పైగా పోలీసులు విచారించారు. విచారణ జరుగుతున్న సమయంలోనే ఆయనను అరెస్టు చేసినట్టు ప్రకటించిన పోలీసులు హైకోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు వ్యక్తులు పూచీకత్తుపై వెంటనే విడుదల చేశారు.
విచారణ సందర్భంగా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్ వ్యంగ్య చిత్రాలను ఎవరు పోస్టు చేశారు? ఎక్కడ తయారు చేశారు? దీనివెనక మరెవరైనా ఉన్నారా? ఎవరి ప్రోద్బలమైనా ఉందా? అని ప్రశ్నించినట్టు సమాచారం. విచారణకు వర్మతో పాటు వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు హాజరయ్యారు.