
ఎరువు దిగిరాక!
సీజన్ ప్రారంభంలోనే భారీగా పెరిగిన ఎరువుల ధరలు బస్తాకు రూ.100 నుంచి రూ.250 వరకు పెరుగుదల రైతులపై అదనపు భారం ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం 1,29,102 హెక్టార్లు జిల్లాలో భారీగా పడిపోయిన సాగు విస్తీర్ణం ఖరీఫ్‌కు అవసరమైన ఎరువులు 54,468 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకూ పంపిణీ 26,759 మెట్రిక్ టన్నులు
సాగు కలిసిరాక..
మార్కాపురం: ఖరీఫ్ ప్రారంభంలోనే కూటమి ప్రభుత్వం రైతులకు షాక్ ఇస్తోంది. ఎరువుల ధరలు భారీగా పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో శనగ, మిర్చి, పత్తి, పొగాకు సాగు చేసిన రైతులకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధరలు లభించడంలేదు. ప్రభుత్వం సైతం పట్టించుకోకపోవడంతో అన్నదాతలు కుదేలయ్యారు. గత సీజన్లలో జరిగిన నష్టాన్ని ఖరీఫ్ సీజన్‌లోనైనా పూడ్చుకుందామని రైతులు ఆశపడ్డారు. పంటల సాగుకు సిద్ధమవుతున్న తరుణంలో కేంద్రం ఎరువుల ధరలు పెంచడంతో వ్యవసాయం చేయడం కష్టమని వాపోతున్నారు. ఇప్పటికే అప్పులు ఎక్కువై పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరో వైపు బ్యాంక్‌ల నుంచి ఖరీఫ్ సీజన్‌లోనైనా వ్యవసాయ రుణాలు వస్తాయా, రావా అనే సందిగ్ధంలో రైతులు ఉండగా, ఊహించని విధంగా ఎరువుల ధరలు పెరగటంతో పంటల సాగు చేయాలంటే రైతులు భయపడుతున్నారు.
జిల్లాలో పంటల సాగు ఇలా
జిల్లా వ్యాప్తంగా 1,29,102 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా ఈ నెల 3వ తేదీ నాటికి 17,285 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. అంటే కేవలం 13.39 శాతం మాత్రమే పంటలు సాగు చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు దాటినా వర్షాలు లేకపోవడంతో పంటల సాగు ముందుకెళ్లడం లేదు. వరి, మొక్కజొన్న, జొన్న, పత్తి, ఇతర పంటలతో పాటు పాడిపోషణలో భాగంగా పారాగడ్డి పెరు గుదలకు యూరియా బాగా అవసరం అవుతోంది. సహకార సొసైటీలు, రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువుల సరఫరా నత్తనడకన సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రధానంగా ప్రతి రైతు దుక్కిలో హెక్టారుకు రెండున్నర బస్తాల డీఏపీని కచ్చితంగా వేస్తారు. 28–28 రకంలో యూరియా, భాస్వరం ఉంటాయి. వేర్లు ఏపుగా పెరిగేందుకు ఉపయోగపడతాయి. 14–35–14 (నత్రజని, భాస్వరం, పొటాష్) ఎరువు వరి, మిర్చిలో ఎక్కువగా వినియోగిస్తారు. 20–20–20–0–13 ఈ ఎరువును వరి, మిర్చి పంటలకు ఎక్కువగా వాడుతారు. ఈ ఎరువులను రైతులు ప్రతి పంటకు వేస్తుంటారు. ఇందులో ప్రధానంగా నత్రజని పెరుగుదలకు, భాస్వరం వేర్ల అభివృద్ధికి, పొటాష్ గింజ నాణ్యతకు, బరువు పెరుగుదలకు, పురుగులు, తెగుళ్లు తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. దీంతో కాంప్లెక్స్ ఎరువులను రైతులు కచ్చితంగా వినియోగించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పెరిగిన ఎరువులు ధరలు రైతులకు భారంగా మారనున్నాయి.
జిల్లాలో ఎరువుల నిల్వలు ఇలా
జిల్లాలో ఖరీఫ్ సీజన్ మొత్తం మీద 54,468 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. గత ఏడాది ఖరీఫ్, రబీకి సంబంధించి ఏప్రిల్ 1 నాటికి 27,111 మెట్రిక్ టన్నుల ఎరువులు మిగులు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 7 నాటికి 29,274 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు చేరాయి. దీంతో మొత్తం 56,385 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వ ఉండగా ఇప్పటి వరకు 26,759 మెట్రిక్ టన్నుల ఎరువులను విక్రయించారు. ప్రస్తుతం 29,626 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వ ఉన్నాయి. ఇందులో కాంప్లెక్స్ ఎరువులు, డీఏపీ, యూరియా, ఎన్‌పీకే, ఎస్‌ఎస్‌పీ, ఎంఓపీ, తదితర రకాల ఎరువులు దుకాణాల్లో ఉన్నాయి. కాంప్లెక్సు ఎరువులకు సంబంధించి 158.45 మెట్రిక్ టన్నులు, డీఏపీ 2933.999 మెట్రిక్ టన్నులు, ఎన్‌పీకేఎస్ 15,922.44 మెట్రిక్ టన్నులు, యూరియా 6,593.492 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వ ఉన్నాయి. ఇంకా ఎంఓపీ, ఎఫ్‌ఓఎం, ఎస్‌ఎస్‌పీ తదితర రకాలు కూడా రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల వద్ద ఉన్నాయి. ఇదిలా ఉండగా ప్రైవేటు వ్యాపారస్తులు మాత్రం రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు.

ఎరువు దిగిరాక!