
రాష్ట్రాన్ని దోచేస్తున్న చంద్రబాబు
రక్షక భటులను భక్షక భటులుగా మార్చారు పోలీసులకు వసూళ్ల డ్యూటీలు వేసి దండుకుంటున్నారు స్థాయిలేని పచ్చనేత నెలకు రూ.2 కోట్లు వసూలు చేస్తున్నాడు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్
త్రిపురాంతకం (యర్రగొండపాలెం): మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకునే పనిలో పడ్డారని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. త్రిపురాంతకంలోని ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో సోమవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మండల పార్టీ కన్వీనర్ సింగారెడ్డి పోలిరెడ్డి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల ఆర్తనాదాలు కూటమి ప్రభుత్వానికి వినిపించడంలేదని, ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు కూటమి ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పిన పచ్చ పెద్దమనుషులు అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఖరీఫ్ సీజన్‌లో 1.76 కోట్ల టన్నుల ఎరువులను ఆర్బీకేలలో నిలువ ఉంచి పంపిణీ చేశారని, చంద్రబాబు ఇప్పటి వరకు ఎరువులను అందజేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక, బియ్యం, మట్టి స్కాంలలో తమ నాయకులను కేటాయించి దోచుకోండని ప్రోత్సహిస్తున్నారని, ప్రజలను రక్షించే పోలీసులను భక్షక భటులుగా మార్చి తమకు అనుకూలంగా మలుచుకున్నారని ఆయన విమర్శించారు. పోలీస్ స్టేషన్లను వసూళ్ల స్టేషన్లుగా మార్చి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని, కొంతమంది పోలీసులు కూటమి నాయకులకు వత్తాసు పలకటమే పనిగా పెట్టుకున్నారని ఆయన అన్నారు. తనకు అన్యాయం జరిగిందని ఎవరైనా పోలీస్ స్టేషన్‌కు వెళ్తే తమ వర్గీయులే చేసిఉంటారని చెప్తున్నారని, పుల్లలచెరువు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గానికి చెందిన రైతు ట్రాక్టర్‌ను తగుల బెడితే తమ పార్టీకి చెందిన నాయకుడే తగులబెట్టి ఉంటాడంటున్నారని అన్నారు. నియోజకవర్గంలో స్థాయిలేని టీడీపీ నాయకుడు ఒకరు ప్రభుత్వ కార్యాలయాల నుంచి నెలకు రూ.2 కోట్లు వసూలు చేస్తున్నాడని, ఆ నాయకుడు డబ్బులు దండుకుంటూ ఆపై దబాయింపులకు దిగుతున్నాడని ఆయన ఆరోపించారు. అంగన్‌వాడీ పోస్టులను అమ్ముకుంటున్నాడని, కేజీబీవీ పాఠశాలలో అడ్మిషన్లు సైతం తమ గుప్పెట్లో పెట్టుకొని ఆ ఖాళీలను భర్తీ చేయిస్తున్నారని అన్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసే పెద్దదోర్నాలలోని ఆర్టీసీ బస్టాండ్ స్థలంపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు కన్నేశాడని అన్నారు. ఆయన నియోజకవర్గంలో డబ్బులు దండుకోవటానికి అధికారం చెలాయిస్తుంటాడని, ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండడని ఆయన వ్యగ్యంగా అన్నారు. యర్రగొండపాలెంలో సాగర్ పైపులను తవ్వుకొని ఎత్తుకొని వెళ్తుంటే చూస్తూ ఉరుకుంటున్నాడని, ఆయన ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాడని ఎమ్మెల్యే ప్రశ్నించారు. త్రిపురాంతకం, ముటుకుల రక్షిత మంచి నీటి పథకాల నిర్వహణ కాంట్రాక్టర్ల నుంచి రూ.40 లక్షలు వసూలు చేసుకున్నాడని, అటువంటి నాయకుడు నియోజకవర్గంలోని నీటి సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తాడని దుయ్యబట్టారు. పోలీసుల సహకారంతో ఇసుక లారీలను అడ్డుకొని టన్నుకు రూ.300, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో పనికి వెళ్లే ఒక్కొక్క ఉపాధి కూలి నుంచి రూ.300, పనికి వెళ్లకుండా మస్టర్ వేయించుకునేవారి నుంచి రూ.600 ప్రకారం వసూళ్లు చేసుకుంటున్నాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. నీ చర్యలు నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో నిన్ను తరిమి వేసే రోజులు దగ్గర పడ్డాయని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆళ్ల సుబ్బమ్మ, జెడ్పీటీసీ మాకం జాన్‌పాల్, మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, వైస్ ఎంపీపీ పాటిబండ్ల కృష్ణ, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు శాసం రంగబాబు, బీసీ సంఘం జిల్లా కార్యదర్శి రాచగొర్ల పిచ్చయ్య, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు దొందేటి నాగేశ్వరరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకటరమణారెడ్డి, పి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని దోచేస్తున్న చంద్రబాబు