
No Headline
ఒంగోలు: సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జిగా వి.లీలా శ్యామ్ సుందరిని నియమిస్తూ ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటి వరకు ఈమె తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే నూతనంగా ఏర్పాటు చేసిన సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జిగా ఒంగోలు మొబైల్ కోర్టు జడ్జి వి.వెంకటేశ్వరరావు మంగళ, శుక్రవారాలలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజా నియామకంతో సింగరాయకొండ జూనియర్ సివిల్ కోర్టులో కేసుల పరిశీలన వేగవంతం కానుంది.
మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణంలో ఇసుక దోపిడీని అరికట్టకపోతే ఈ నెల 16 నుంచి లారీల సమ్మె చేస్తామని, అవసరమైతే తామే వినియోగదారులకు టన్ను ఇసుక రూ.950 లకు అందజేస్తామని మార్కాపురం లారీ అసోసియేషన్ నాయకులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కాంట్రాక్టర్ గొట్టిపాటి సురేంద్ర గతంలో తాము తెచ్చే ఇసుకను టన్ను రూ.950లకు కొనుగోలు చేసి వినియోగదారులకు టన్ను రూ.1200 లకు అమ్ముకునే వారని అన్నారు. అయితే ఈ నెల 1న తమను పిలిపించి కేవలం టన్ను ఇసుక రూ.800లకు మాత్రమే విక్రయించాలని సురేంద్ర కోరారని లారీ అసోసియేషన్ నాయకులు తెలిపారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని, ఇప్పటికే ఈ విషయమై కలెక్టర్, ఎస్సీ, స్థానిక అధికారులకు వినతి పత్రాలు అందజేశామన్నారు. వారు స్పందించకపోతే ఈ నెల 16 నుంచి యార్డుకు ఇసుక సరఫరా నిలిపేస్తామని హెచ్చరించారు. అవసరమైతే మేమే వినియోగదారులకు ఇసుక టన్ను రూ.950లకు విక్రయిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉచిత ఇసుక అని గొప్ప చెబుతున్నారని ఆచరణలో మాత్రం ప్రజల నుంచి ఎక్కువ వసూలు చేస్తున్నారని వినతిపత్రంలో తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కాశీరాంసింగ్, లారీ అసోసియేషన్ నాయకులు ఉన్నారు.
ఒంగోలు సిటీ: ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలోని బీఎడ్ కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఏకేయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి సూచనల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 10,955 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 94.37 శాతంతో 10,339 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ స్థాయిలో, ఆయా కళాశాలల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఏకేయూ ఉప కులపతి ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు అభినందించారు. మూడో సెమిస్టర్ ఫలితాల విడుదల కార్యక్రమంలో సీఈ ప్రొఫెసర్ సోమశేఖర, పీజీ కో ఆర్డినేటర్ (నాన్ కాన్ఫిడెన్షియల్ ) డాక్టర్ ఆర్.శ్రీనివాస్, పరీక్షల విభాగం పర్యవేక్షకులు సూడా శివరామ్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

No Headline