వాహన మిత్ర నగదు ఇచ్చి ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వాహన మిత్ర నగదు ఇచ్చి ఆదుకోవాలి

Aug 12 2025 11:09 AM | Updated on Aug 12 2025 11:09 AM

వాహన మిత్ర నగదు ఇచ్చి ఆదుకోవాలి

వాహన మిత్ర నగదు ఇచ్చి ఆదుకోవాలి

కందులూరు–1 డ్వాక్రా గ్రూపులో ఫోర్జరీ సంతకాలు చేసిన వెలుగు సీసీ చింతలలో అక్రమంగా సాగు చేసిన రొయ్యల చెరువులు తొలగించాలి మీ కోసంలో కలెక్టర్‌కు అర్జీలు

ఒంగోలు సబర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న ప్రతి ఆటో కార్మికుడికి వాహన మిత్ర పథకం కింద సంవత్సరానికి రూ.25 వేలు ఇచ్చి ఆదుకోవాలని ఆటో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నాయకులు గంటెనపల్లి శ్రీనివాసులు, తంబి శ్రీనివాసులు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న మీ కోసం కార్యక్రమంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటో డ్రైవర్లకు బాడుగులు తగ్గుతాయని, ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతింటుందన్నారు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలతో ఇబ్బందులు పడుతున్నామని విన్నవించారు. పెట్రోల్‌, డీజిల్‌ చార్జీలపై విధించిన వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అన్ని రకాల ఫీజులు, పెనాల్టీలు తగ్గించాలని, ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గించాలని, వాహన కొనుగోలుకి బ్యాంకుల ద్వారా రూ.4 లక్షలు సబ్సిడీతో వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని కోరారు.

ఫోర్జరీ సంతకాలతో డ్వాక్రా గ్రూపులో మార్పులు...

టంగుటూరు మండలం కందులూరు గ్రామంలోని కందులూరు–1 లోని గ్రామైక్య సంఘంలో సభ్యులుగా ఉన్న డ్వాక్రా గ్రూప్‌ సభ్యులకు తెలియకుండా, గ్రూపుల సమావేశం జరపకుండా ఫోర్జరీ, దొంగ సంతకాలతో దారుణాలు చేశారని గ్రామైక్య సంఘం సభ్యులు మీ కోసం కార్యక్రమంలో కలిసి అందుకు సంబంధించిన ఆధారాలను అధికారులకు సమర్పించారు. వెలుగు సీసీ చెన్నుపాటి కవిత నిర్వహణ బాధ్యుల పేర్లను మార్చి అక్రమాలకు పాల్పడిందన్నారు. కవితపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మీ కోసం కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం నాయకులు బొట్ల సుబ్బారావుతో పాటు డ్వాక్రా గ్రూపు సభ్యులు ఉన్నారు.

అక్రమంగా వేసిన రొయ్యల చెరువులు తొలగించాలి:

కొత్తపట్నం మండలం అల్లూరు పంచాయతీ పరిధిలోని చింతల వద్ద (టిడ్కో ఇళ్లకు ఆనుకొని) అక్రమంగా వేసిన రొయ్యల చెరువులను తొలగించాలని చింతలకు చెందిన డీఎల్‌ఎస్‌వీ పీఎల్‌వీ శింగంనేని ఆంజనేయులు మీ కోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. చింతలకు చెందిన మంచినీటి చెరువుకు ఆనుకొని వాన్‌పిక్‌కు చెందిన భూముల్లో గ్రామానికి చెందిన శింగంనేని చంద్రశేఖర్‌ రావు అక్రమంగా రొయ్యల చెరువులు సాగు చేస్తున్నాడన్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా విద్యుత్‌ అధికారులు అక్రమంగా విద్యుత్‌ కనెక్షన్లు కూడా ఇచ్చారని చెప్పారు. అధికార పార్టీ అండదండలతో అక్రమంగా రొయ్యల చెరువులు సాగు చేస్తున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవటం లేదని ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement