తిరిగొచ్చేనా..! | - | Sakshi
Sakshi News home page

తిరిగొచ్చేనా..!

Aug 12 2025 11:09 AM | Updated on Aug 12 2025 11:09 AM

తిరిగ

తిరిగొచ్చేనా..!

తియ్యటి రోజులు

కంభం: ఎటుచూసినా చెరకు తోటలు.. పంట కోతకొస్తే ఏడాదిలో సుమారు 6 నెలల పాటు బెల్లం తయారీ.. షుగర్‌ ఫ్యాక్టరీతో పాటు ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా చెరకు రసం తియ్యదనం.. ఇవన్నీ కంభం, ఆ పరిసర ప్రాంతాల్లో ఒకప్పటి రోజులు. ప్రస్తుతం ప్రజలతో పాటు రైతులకు కూడా ఆ తియ్యదనం దూరమైంది. కేవలం అడవి పందుల బెడద కారణంగా కంభం చెరువు ఆయకట్టులో చెరకు సాగును రైతులు పూర్తిగా వదిలేశారు. అరటి సాగువైపు మొగ్గుచూపారు. చారిత్రాత్మక కంభం చెరువు ఆయకట్టు ఒకప్పుడు చెరకు పంటతో కళకళలాడుతుండేది. చెరకు పంట సాగుకు కంభం, ఆ పరిసర ప్రాంతాలు పెట్టింది పేరుగా ఉండేవి. కంభంలో తయారు చేసిన బెల్లం రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతయ్యేది. కంభం చెరువు ఆయకట్టు పరిధిలో సుమారు వెయ్యి ఎకరాల్లో చెరకు పంట సాగు చేసేవారు. దసరా, సంక్రాంతి, ఇతర ముఖ్య పండుగలకు బెల్లంకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుండటంతో వ్యాపారులు ఏకంగా రైతుల పొలాల దగ్గరికే వచ్చి బెల్లం కొనుగోలు చేసేవారు. తురిమెళ్ల వెళ్లే రహదారి వెంట, బేస్తవారిపేట రహదారి పక్కన, కంభం చెరువుకు వెళ్లేమార్గంలో రైతులు బెల్లం తయారు చేస్తుంటే.. వాహనదారులు, ప్రయాణికులు అక్కడికి వెళ్లి రైతులను అడిగి చెరకు రసం తాగేవారు. చెరకు పంటకు తెగుళ్లు ఎక్కువగా ఆశించవు. అందువలన లాభాలు రాకపోయినా నష్టాలు మాత్రం వచ్చేవి కావు. దీంతో ఈ ప్రాంతంలో చెరకు సాగు అధికంగా ఉండేది. అప్పట్లో కంభం పట్టణంలో షుగర్‌ ఫ్యాక్టరీ కూడా ఉండేదంటే ఈ ప్రాంతంలో చెరకు పంట ఏ స్థాయిలో సాగయ్యేదో అర్థం చేసుకోవచ్చు.

20 ఏళ్లుగా నిలిచిపోయిన చెరకు సాగు...

దాదాపు 20 ఏళ్లుగా ఈ ప్రాంతంలో చెరకు పంట సాగు ఆగిపోయింది. చెరకు పంట సాగు కనుమరుగవడానికి ప్రధాన కారణం అడవి పందులే. ఆరుగాలం శ్రమించి సాగుచేసుకున్న చెరకు పంటపై అడవి పందుల దాడి పెరిగిపోయింది. చుట్టూ కొండలు ఉండటంతో పగలూరాత్రీ తేడా లేకుండా అడవి పందులు గుంపులు గుంపులుగా వచ్చి చెరకు తోటల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని పంట మొత్తం నాశనం చేసేవి. వాటి నుంచి రక్షణ పొందేందుకు కరెంటు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. అడవి పందులను చంపడం చట్టరీత్యా నేరమైనందుకు వాటిని ఏమీ చేయలేక కాలక్రమంలో రైతన్నలు చెరకు పంటనే తగ్గించుకుంటూ వచ్చారు. ప్రభుత్వాలు, అధికారులు సైతం అడవి పందుల నుంచి చెరకు పంటను రక్షించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం చెరకు సాగు పూర్తిగా కనుమరుగైపోయింది.

ప్రత్యామ్నాయంగా అరటి సాగు...

చెరకు పంట సాగు చేయలేమని నిర్ణయించుకున్న కంభం చెరువు ఆయకట్టు రైతులు అరటి పంటను ప్రత్యామ్నాయ పంటగా ఎంచుకున్నారు. నంద్యాల, మహానంది, తమిళనాడు, తదితర ప్రాంతాల నుంచి అరటి పిలకలు తెప్పించి సాగుచేయడం మొదలు పెట్టారు. దీంతో ప్రస్తుతం కంభం చెరువు ఆయకట్టు కింద చెరకు స్థానంలో అరటి తోటలు దర్శనమిస్తున్నాయి. గతంలో పసుపు చివరి దశలో అంతర పంటగా చెరకు వేసే వారు. ప్రస్తుతం దాని స్థానంలో కూడా అరటి వేస్తున్నారు. అరటికి పెట్టుబడి ఎక్కువ. ఈదురుగాలులు, తుఫాన్‌లు వస్తే చెట్లు కూలిపోయి నష్టం వాటిల్లుతోంది. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అరటినే సాగుచేసుకుంటున్నారు. ప్రస్తుతం కంభం పరిసర ప్రాంతాల్లో బోర్ల కింద అరటి సాగులో ఉంది.

కేవలం చెరకు రసం వరకే సాగు...

కంభం మండలంలో పూర్తిగా చెరకు సాగు కనుమరుగవగా, చుట్టుపక్కల ప్రాంతాల్లో 20–30 ఎకరాల్లో మాత్రమే చెరకు సాగు జరుగుతోంది. ఆ పంటను చెరకు రసం విక్రయించుకునే వారు కొనుగోలు చేసుకుంటున్నారు. బెల్లం తయారు చేయాలంటే ఎకై ్సజ్‌ అధికారులు కొర్రీలు పెడుతుండటంతో రైతులు బెల్లం తయారీపై కూడా ఆసక్తి చూపడం లేదు. చెరకు రసం విక్రయదారులకు క్వింటాల చొప్పున చెరకు పంట విక్రయిస్తున్నారు.

చెరకు సాగుకు చర్యలు తీసుకోవాలి...

కంభం చెరువు ఆయకట్టు కింద రైతులు తిరిగి చెరకు పంట సాగుచేసుకునేలా ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకుని ప్రోత్సహించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. అడవి పందుల నుంచి రక్షణ కల్పించేందుకు భరోసా ఇవ్వడంతో పాటు ఉద్యానవన పంటల మాదిరిగా చెరకు పంట సాగుకు ప్రోత్సాహం అందిస్తే తిరిగి ఈ ప్రాంతంలో చెరకు సాగులోకి వచ్చే అవకాశం ఉందని ఇక్కడి ప్రజలు ఆశాభావం వ్యకం చేస్తున్నారు.

చెరకు పంట (ఫైల్‌)

కంభం చెరువు ఆయకట్టు కింద పూర్తిగా కనుమరుగైన చెరకు పంట

గతంలో 1000 ఎకరాలకుపైగా చెరకు సాగు

కంభంలో కొన్ని సంవత్సరాల పాటు కొనసాగిన షుగర్‌ ఫ్యాక్టరీ

ఏడాదిలో ఆరు నెలల పాటు బెల్లం తయారీ

ప్రస్తుతం 20–30 ఎకరాల్లోనే చెరకు సాగు

అడవి పందుల బెడదే ప్రధాన కారణం

చెరకు సాగును పూర్తిగా వదిలేసి అరటివైపు మొగ్గుచూపిన ఆయకట్టు రైతులు

ప్రభుత్వం పట్టించుకుని ప్రోత్సహించాలంటున్న ప్రజలు

చెరకు సాగుకు బదులు అరటి వేస్తున్నాం

గతంలో పది ఎకరాలకుపైగా చెరకు తోటలు సాగుచేశాం. కూలీల ఖర్చులు పెరిగిపోవడం, అడవి పందుల దాడి ఎక్కువై పోవడంతో చెరకు సాగును పూర్తిగా వదిలేసి అరటి వేసుకుంటున్నాం.

– అబ్దుల్‌ వహీద్‌, రైతు, కంభం

పందుల బెడదతోనే

అడవి పందుల బెడదతోనే చెరకు పంటను రైతులు సాగుచేయడం లేదు. ఆరుగాలం శ్రమించి సాగుచేసుకున్న పంటను అడవి పందులు నాశనం చేస్తుండటంతో నష్టాలు రావడం మొదలై పూర్తిగా చెరకు వదిలేసే పరిస్థితులొచ్చాయి.

– షేక్‌ ఖయూం, రైతు, కంభం

ప్రత్యామ్నాయంగా అరటి సాగు...

చెరకు పంట సాగు చేయలేమని నిర్ణయించుకున్న కంభం చెరువు ఆయకట్టు రైతులు అరటి పంటను ప్రత్యామ్నాయ పంటగా ఎంచుకున్నారు. నంద్యాల, మహానంది, తమిళనాడు, తదితర ప్రాంతాల నుంచి అరటి పిలకలు తెప్పించి సాగుచేయడం మొదలు పెట్టారు. దీంతో ప్రస్తుతం కంభం చెరువు ఆయకట్టు కింద చెరకు స్థానంలో అరటి తోటలు దర్శనమిస్తున్నాయి. గతంలో పసుపు చివరి దశలో అంతర పంటగా చెరకు వేసే వారు. ప్రస్తుతం దాని స్థానంలో కూడా అరటి వేస్తున్నారు. అరటికి పెట్టుబడి ఎక్కువ. ఈదురుగాలులు, తుఫాన్‌లు వస్తే చెట్లు కూలిపోయి నష్టం వాటిల్లుతోంది. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అరటినే సాగుచేసుకుంటున్నారు. ప్రస్తుతం కంభం పరిసర ప్రాంతాల్లో బోర్ల కింద అరటి సాగులో ఉంది.

తిరిగొచ్చేనా..! 1
1/3

తిరిగొచ్చేనా..!

తిరిగొచ్చేనా..! 2
2/3

తిరిగొచ్చేనా..!

తిరిగొచ్చేనా..! 3
3/3

తిరిగొచ్చేనా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement