
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి యువకుడు బలి
దర్శి: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ యువకుడిని బలి తీసుకుంది. ఈ సంఘటన దర్శి పట్టణంలోని సందువారిపాలెం వద్ద సోమవారం చోటుచేసుకుంది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు దిమ్మె ఏర్పాటు చేసి దానిపై ట్రాన్స్‌ఫార్మర్ పెట్టే విషయంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం పోయింది. ఈ సంఘటనతో దర్శి పట్టణం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆ వివరాల్లోకి వెళితే.. సందువారిపాలెం ప్రాంతంలోని చింతలపాలెం రోడ్డు వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశారు. దాని కోసం దిమ్మె కూడా నిర్మించారు. అయితే, ఆ దిమ్మైపె ట్రాన్స్‌ఫార్మర్ పెట్టకుండా పక్కనున్న ఇనుప దమ్ము చక్రాలపై ఇనుప అడ్డీలు వేసి ట్రాన్స్‌ఫార్మర్ పెట్టి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. ఆ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి నిత్యం విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అక్కడే పేడదిబ్బలు వేయడంతో పాటు జన సంచారం కూడా ఉంటోంది. చిల్ల చెట్లు పెరిగి ట్రాన్స్‌ఫార్మర్ పరిసరాలు భయంకరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్థానికుడైన ఉప్పు నారాయణ (27) అనే యువకుడు గేదెలకు మేత తీసుకొస్తుండగా, అతని చేతిలోని పచ్చి మేత దంట్లు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వైర్లకు తగిలాయి. దీంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపించారు. నారాయణ తండ్రి ఉప్పు శ్రీను బేల్దారి మేస్త్రిగా పనిచేస్తున్నారు. నారాయణ ఏకై క సంతానం కావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తూర్పుచౌటపాలెం రోడ్డులోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద పాల కేంద్రం నిర్వహిస్తున్న నారాయణకు ఇంకా వివాహం కాలేదు. ఇదిలా ఉండగా, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా విద్యుత్ అధికారులు అప్పటికప్పుడు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను దమ్ము చక్రాల పైనుంచి తీసి దిమ్మైపె పెట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి యువకుడి ప్రాణం తీసిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో యువకుని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
విద్యుదాఘాతంతో మరో యువకుడు మృతి...
అద్దంకి రూరల్: డీజే బాక్సులు విప్పుతుండగా విద్యుదాఘాతంతో మరో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి అద్దంకి మండలంలో చోటుచేసుకోగా, సోమవారం వెలుగులోకి వచ్చింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ముండ్లమూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన నాగేంద్రబాబు (25) ఫంక్షన్‌లకు డీజే బాక్సులు ఏర్పాటు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో అద్దంకి మండలంలోని ధర్మవరం గ్రామంలో ఆదివారం రాత్రి డీజే ఏర్పాటు చేశారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత డీజే బాక్సులు విప్పేందుకు పైకెక్కి విప్పదీస్తుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. స్థానికులు వెంటనే కారులో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి వైద్యశాలలోని మార్చురీలో ఉంచారు.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి యువకుడు బలి

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి యువకుడు బలి