
ఉద్యోగాల పేరుతో రూ.5.90 లక్షలకు టోకరా
ఒంగోలు టౌన్: పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒంగోలు ఇందిరాకాలనీకి చెందిన వ్యక్తి తనతో పాటు మరో 15 మంది వద్ద నుంచి 5.90 లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడని ఒంగోలు సమతా నగర్‌కు చెందిన బాధితుడు సోమవారం పోలీస్‌శాఖ నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు ఉద్యోగ నియామక పత్రాలు కూడా ఇచ్చాడని, వాటిని తీసుకుని కార్యాలయాలకు వెళ్లి అధికారులకు సంప్రదించగా, అవి నకిలీ నియామకపత్రాలని తెలిసిందని వాపోయాడు. దాంతో సదరు వ్యక్తిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా జవాబు ఇస్తున్నాడని తెలిపారు. అలాగే మోటారు బైకు పేరుతో మోసపోయినట్లు మరొకరు ఫిర్యాదు చేశారు. మోటారు బైకు కొనుగోలు చేసేందుకుగానూ ఒంగోలుకు చెందిన ఒక డీలర్‌ను సంప్రదించగా తన వద్ద 90 వేల రూపాయలకు రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనం ఉందని నమ్మబలికాడన్నారు. అందుకుగానూ తొలుత రూ.20 వేల అడ్వాన్స్ తీసుకున్నాడని తెలిపారు. రెండు రోజుల్లో వాహనాన్ని డెలివరీ చేస్తానని చెప్పాడని, నేటికి 15 రోజులు గడిచినప్పటికీ వాహనం ఇవ్వలేదని తెలిపారు. తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించమని అడిగితే బెదిరిస్తున్నాడని చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి 52 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులతో నేరుగా ఎస్పీ మాట్లాడి వారి సమస్యలడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సెల్ ఇన్‌స్పెక్టర్ దుర్గా ప్రసాద్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ జగదీష్, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, గ్రీవెన్స్ ఎస్సై జనార్దన్‌రావు పాల్గొన్నారు.
చీమకుర్తి: బైకు ఢీకొనడంతో చీమకుర్తి మున్సిపాలిటీలో వర్కర్‌గా పనిచేస్తున్న పిన్నిక విజయమ్మ (50) మృతి చెందింది. సోమవారం తెల్లవారుజామున చీమకుర్తి మెయిన్‌రోడ్డులోని జవహర్ ఆస్పత్రి సమీపంలో తోటి మున్సిపల్ వర్కర్లతో కలిసి చెత్త ఎత్తి ట్రాక్టర్‌లో వేస్తున్న సమయంలో బైకుపై వెళ్తున్న ముత్తువేల్ అనే వ్యక్తి విజయమ్మను ఢీకొట్టాడు. ఆమె పక్కటెముకలు విరిగి తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయింది. తోటి వర్కర్లు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందినట్లు మృతురాలు భర్త పిన్నిక శ్రీనివాసరావు తెలిపారు. బైకుతో ఢీకొట్టిన ముత్తువేల్ స్థానిక గ్రానైట్ క్వారీలో పొక్లెయిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముత్తువేల్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ ఎం.సుబ్బారావు వెల్లడించారు.
కంభం: ఓ గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పదస్థితిలో రైలు కిందపడి మృతిచెందిన సంఘటన సోమవారం కంభం మండలంలోని సూరేపల్లి సమీపంలో రైలు పట్టాలపై వెలుగు చూసింది. మార్కాపురం రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుమారు 35–40 సంవత్సరాల వయసున్న వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. నైట్ ప్యాంట్, చెక్స్ షర్టు ధరించి ఉన్నాడు. అతని వద్ద ఆదివారం రాత్రి కంభం నుంచి గుంటూరు వెళ్లేందుకు ఇద్దరికి తీసుకున్న టికెట్ ఉంది. అతని చేతికి రాఖీ కట్టి ఉంది. మృతదేహం పడి ఉన్న తీరు చూస్తే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తున్నప్పటికీ.. మృతుడి వద్ద ఇద్దరికి సంబంధించిన టికెట్ ఉన్న నేపథ్యంలో అతనితో పాటు ఉన్న మరో వ్యక్తి ఎవరు, టికెట్ తీసుకుని కంభం రైల్వేస్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూరేపల్లి వరకు ఎందుకు వెళ్లాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ రైల్లోనే ప్రయాణించి దిగాడనుకుంటే.. అక్కడ రైల్వేస్టేషన్ కూడా లేదు. అలాంటప్పుడు ఆ వ్యక్తి అక్కడికి ఎందుకు వెళ్లాడు, ఎలా వెళ్లాడు.? అతనితో పాటు ఉన్న మరో వ్యక్తి ఎవరో తేలాల్సి ఉంది. మృతదేహం నంద్యాల వైపు వెళ్లే పట్టాలపై పడి ఉండగా, రైలు పట్టాలకు ఇరువైపులా చెప్పులు పడి ఉన్నాయి. దీంతో అతని మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

ఉద్యోగాల పేరుతో రూ.5.90 లక్షలకు టోకరా

ఉద్యోగాల పేరుతో రూ.5.90 లక్షలకు టోకరా