
No Headline
మార్కాపురం: ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కోర్టులో వాయిదాకు హాజరై తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్టాండ్‌లో ఉండగా అతనిపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం మార్కాపురంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2018 ఏప్రిల్‌లో ముండ్లమూరు మండలంలోని ఈదర గ్రామంలో క్రిష్ణపాటి వెంగళరెడ్డి కుమారుడు కొండారెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో అదే గ్రామానికి చెందిన బండి బాపిరెడ్డి ప్రమేయం ఉన్నట్లు వెంగళరెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బాపిరెడ్డిని అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచగా బెయిల్‌పై బయటకు వచ్చాడు. గ్రామంలో మళ్లీ గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అప్ప ట్లో బాపిరెడ్డిని ఈదర నుంచి బయటకు పంపారు. ఆయన బ్రహ్మంగారి మఠంలో ఉంటున్నాడు. సోమవారం మార్కాపురం ఆరో అదనపు న్యాయ స్థానంలో వాయిదాకు హాజరై మఠం వెళ్లేందుకు బస్టాండ్‌కు వెళ్లి బస్సులో కూర్చుని ఉండగా వెంగళరెడ్డితో పాటు మరికొంత మంది వచ్చి తన కళ్లలో కారం చల్లి హత్య చేసేందుకు ప్రయత్నించారని దీంతో తాను గట్టిగా కేకలు వేస్తూ తప్పించుకున్నట్లు బాపిరెడ్డి తెలిపాడు. తనపై వెంగళరెడ్డి కారంపొడి చల్లి ఇనుపరాడ్డుతో దాడికి ప్రయత్నించాడని పట్టణ పోలీసు స్టేషన్‌లో బాపిరెడ్డి ఫిర్యాదు చేశాడు. నిందితులు పరారు కాగా పోలీసులు సీసీ టీవీలో పరిశీలించి వెంగళరెడ్డికి చెందిన కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సంఘటన జరిగిన ఆర్టీసీ బస్టాండ్‌కు సీఐ సుబ్బారావు, ఎస్సై సైదుబాబు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఒంటిపై కారంపొడితో బాపిరెడ్డి
బస్టాండ్‌లో విచారణ చేస్తున్న సీఐ సుబ్బారావు

No Headline