
కూటమి పాలనలో చుండూరు తరహా దాడులు
ఒంగోలు టౌన్: కూటమి పాలనలో చుండూరు తరహా దాడులు పునరావృతం అవుతున్నాయని ప్రకాశం జిల్లా రజక వృత్తిదారుల సంఘ ప్రధాన కార్యదర్శి రాయల మాలకొండయ్య ఆందోళన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా కారంచేడులో రజక సామాజికవర్గానికి చెందిన మూగ యువతిపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనమని అన్నారు. నగరంలోని ఎల్బీజీ భవన్‌లో రజక వృత్తిదారుల సంఘం, అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ కం ఇరస్త్‌రీదారుల సంఘం సంయుక్తంగా సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు కారంచేడు, చుండూరులో ఎస్సీ, ఎస్టీ మైనారిటీల మీద దాడులు చేసి కొంతమంది అమాయకులను అత్యంత క్రూరంగా హత్యలు చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం బీసీలపై ప్రేమ ఉన్నట్లు మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీసీలపై దాడులు ఎక్కువైపోయాయని, బీసీలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. కూటమి పాలకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కారంచేడు మూగ యువతిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేసును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించకుండా నిందితులను అరెస్టు చేయాలన్నారు. బలహీన వర్గాలకు చెందిన రజకులపై ఎటువంటి విచారణ చేయకుండానే కేసు నమోదు చేయడం దుర్మార్గమని, న్యాయవిరుద్ధమైన ఇలాంటి చర్యలు తగవని హితవు పలికారు. బీసీలకు సామాజిక రక్షణ కల్పించాలని, రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి దాడులు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని కోరారు. సమావేశంలో రజక సంఘ జిల్లా నాయకులు ఆవులమంద రమణమ్మ, డాక్టర్ కృష్ణయ్య, మంచికలపాటి శ్రీనివాసులు, గుర్రపుశాల శ్రీను, శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.