
వానమ్మా.. రావమ్మా!
● సకాలంలో వర్షాలు కురవాలని పోలేరమ్మ, అంకాలమ్మకు బోనాలు
పెద్దదోర్నాల: సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ మండల పరిధిలోని ఐనముక్కలలో గ్రామస్తులు పోలేరమ్మ, అంకాలమ్మలకు ఆదివారం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి సకాలంలో వర్షాలు కురవక ఏరువాక సాగని ప్రస్తుత తరుణంలో వర్షాలు బాగా పడాలని, పాడి పంటలు వృద్ధి చెందాలని మొక్కుకుని పోలేరమ్మ తల్లికి 108 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం పోలేరమ్మకు కుంకుమ బండిని అందంగా అలంకరించి గ్రామంలో కొమ్ము బూరాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వీధుల్లో మహిళలు వారు పోసి పోలేరమ్మ కుంకుమబండికి స్వాగతం పలికి తలపై బోనాలతో సమీపంలోని పోలేరమ్మ తల్లి గుడికి చేరుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు.