
13న క్విట్ కార్పొరేట్ నినాదంతో ర్యాలీ
ఒంగోలు టౌన్: జాతీయోద్యమంలో బ్రిటిష్ ముష్కరులను దేశం నుంచి తరిమికొట్టేందుకు నిర్వహించిన క్విట్ ఇండియా పోరాటం స్ఫూర్తితో ఈ నెల 13వ తేదీ ఒంగోలు నగరంలో క్విట్ కార్పొరేట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు తెలిపారు. స్థానిక ఎల్బీజీ భవనంలో ఆదివారం రైతు సంఘాలు, కార్మిక సంఘాలు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చుండూరి రంగారావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడేసి, రైతులను దివాలా తీయడం ద్వారా తన లక్ష్యాన్ని సాధించుకునేందుకు అనేక చట్టాలను తీసుకొస్తుందని చెప్పారు. మోదీ కుట్రలకు వ్యతిరేకంగా దేశంలోని రైతు సంఘాలు, రైతులు, కార్మికులు కలిసి పోరాటాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 83 ఏళ్ల క్రితం చేపట్టిన క్విట్ ఇండియా స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్‌కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నగరంలోని మినీ స్టేడియం వరకు ట్రాక్టర్లు, మోటారు బైకులతో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. నగరంలోని ప్రజలు ఈ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జజ్జూరి జయంతి బాబు అధ్యక్షత వహించగా ఎస్ లలిత కుమారి, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, కోడూరు హనుమంతరావు, కొండ్రు గుంట సుబ్బారావు, జీవీ కొండారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, ఇరిగినేని వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.