
ప్రైవేటు ఉపాధ్యాయులకు కనీస వేతనాలు ఇవ్వాలి
ఒంగోలు టౌన్: ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కనీస వేతనాలు ఇవ్వాలని, ప్రభుత్వ గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సూర్యారావు డిమాండ్ చేశారు. మంగమూరు రోడ్డులోని శ్లోక ట్యూషన్ సెంటర్‌లో ఆదివారం పీటీఎల్‌పీడబ్ల్యూఏ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు వై.సాంబశివరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు రెండున్నర లక్షల మందికి పైగా ప్రైవేటు ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. అరకొర జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారని చెప్పారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యపోరాటాలు చేయడం మినహా మరే మార్గంలేదన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్.రవి మాట్లాడుతూ ప్రైవేటు ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు మధ్య బోధనలోనూ, ఫలితాల్లోనూ వ్యత్యాసమేమీ ఉండదని చెప్పారు. వేతనాల్లో మాత్రం భారీగా తేడా ఉంటోందన్నారు. ఆ అంతరాన్ని తొలగించి ప్రైవేటు ఉపాధ్యాయులు కూడా గౌరవ ప్రదమైన వేతనాలతో జీవితాన్ని గడిపేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు ఉపాధ్యాయుల పోరాటాలకు యూటీఎఫ్ తమ వంతు సహకారం అందజేస్తుందని చెప్పారు. డీవైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు మాట్లాడుతూ... డీఎస్సీ అభ్యర్థుల పోరాటానికి ఎలాంటి సహకారం అందించామో, అదే తరహాలో ప్రైవేటు ఉపాధ్యాయుల పోరాటాలకు మద్దతునిస్తామని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు టి.రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి యూ.కిరణ్ పాల్గొన్నారు.