
రైతులకు న్యాయం
స్వామినాథన్ సిఫార్సులతోనే
ఒంగోలు టౌన్: వ్యవసాయ రంగంలో సంక్షోభం నివారించేందుకు స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయడం ఒక్కటే మార్గమని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య చెప్పారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తే రైతులకు గిట్టుబాటు ధరలు లభించి వ్యవసాయాన్ని కొనసాగిస్తారన్నారు. నగరంలోని ఎల్బీజీ భవనంలో శనివారం ప్రొఫెసర్ స్వామినాథన్ శత జయంతి సభ జరిగింది. సభకు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జజ్జూరి జయంతిబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు వామపక్షాల డిమాండ్ మేరకు యూపీఏ ప్రభుత్వం 2004లో స్వామినాథన్ కమిషన్ వేసిందని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన స్వామినాథన్ ఇచ్చిన నివేదిక మేరకు చర్యలు తీసుకొని ఉంటే రైతులు రోడ్డెక్కే దుస్థితి ఉండేది కాదన్నారు. కమిషన్ నివేదిక ప్రకారం పేదల చేతికి భూమి ఇవ్వకుండా సామాజిక సమానత్వాన్ని సాధించడం కష్టమని చెప్పారని తెలిపారు. ప్రభుత్వం మద్దతు ఉంటేనే వ్యవసాయరంగం సుభిక్షంగా కొనసాగుతుందని చెప్పారు. ప్రాజెక్టును నిర్మించడం ద్వారా సాగుకు అవసరమైన నీరిందివ్వాల్సిన అవసరముందన్నారు. మద్దతు ధరలను నిర్ణయించడంలో సీ2 ప్లస్ 50 ఫార్మూలాను అమలు చేయాలని స్వామినాథన్ సూచించారని చెప్పారు. కమిషన్ సూచనలను పాటించకపోగా వ్యవసాయ రంగంలో 10 శాతానికి మించి ఉండాల్సిన అవసరం లేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలతో రైతులు వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితి దాపురించిందన్నారు. వ్యవసాయాన్ని కాపాడుకోవడం దేశ ప్రజలందరి బాధ్యతని, ఇందుకోసం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో శ్రీకాంత్ కొల్లూరు, బెజవాడ వెంకటేశ్వర్లు, అబ్బూరి శ్రీనివాసరావు, గాలి వెంకట్రామిరెడ్డి, సంతు వెంకటేశ్వర్లు, రాజశేఖరరెడ్డి, తిరుపతిరెడ్డి, ప్రసాద్, ఊస వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తొలుత స్వామినాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులచారు.