
గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి
ఒంగోలు వన్‌టౌన్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా రెవెన్యూ అధికారి బి.చినఓబులేశు అన్నారు. నగరంలోని గిరిజన భవన్‌లో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఆర్‌ఓ మాట్లాడుతూ ఇటీవల పుల్లలచెరువు మండలం నరజాముల తండాలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల విషయంలో ఆటవీశాఖ అధికారులు అభ్యంతరం తెలపడంతో ఆయా భూములపై హక్కులను నిర్ధారించేందుకు కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ప్రత్యేకంగా సర్వే చేయించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారన్నారు. గిరిజన ఆవాస ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. గిరిజనులు స్వశక్తితో జీవనోపాధులు పెంపొందించుకునేందుకు ప్రభుత్వం ఇస్తోన్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు గిరిజన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున డాక్టర్ బాలాజీనాయక్, డాక్టర్ లక్ష్మనాయక్ సహకారంతో అందించారు. కార్యక్రమంలో ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, గిరిజన నాయకులు పేరం సత్యం తదితరులు పాల్గొన్నారు.

గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి