
కుక్కల దాడిలో అడవిదుప్పి మృతి
సీఎస్‌పురం(పామూరు): మండలంలోని వి.బైలు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కుక్కల దాడిలో అడవి దుప్పి మృతి చెందింది. ఈ ఘటన శనివారం వెలుగుచూసింది. ఉదయం గ్రామ సమీపంలోనికి అడవి దుప్పి రాగా గమనించిన కుక్కలు దాన్ని వెంబడించాయి. గ్రామానికి సమీపంలోని జాలు వాగువద్ద కుక్కలు అడవి దుప్పిపై దాడిచేసి గాయపరిచి చంపేశాయి. సమీపంలో పొలాల్లో ఉన్న రైతులు ఈ విషయాన్ని గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జగన్నాథ వెంకటేశ్వర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కేశవరావు సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి మృతి చెందిన అడవిదుప్పిని పరిశీలించారు. పశువైద్యాధికారి మునీర్ పోస్టుమార్టం చేశారు.
ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
పొదిలి రూరల్: స్థానిక విశ్వనాథపురం ఆంజనేయస్వామి గుడి దగ్గర ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. వివరాల్లోకి వెళితే..ఆంజనేయస్వామి ఆలయం దగ్గర స్పీడ్‌బ్రేకర్ ఉండటంతో నెమ్మదిగా వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వచ్చిన బస్సు తగలడంతో ట్రాక్టర్ ట్రక్కు పైభాగం కిందపడింది. బస్సు ముందుభాగం దెబ్బతింది.
కత్తులతో దాడి
● ఇద్దరికి తీవ్ర గాయాలు
పొదిలి: పట్టణంలోని విశ్వనాథపురంలో ఇద్దరు వ్యక్తులు కత్తులతో పరస్పరం దాడి చేసుకోవటంతో తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానిక ఒంగోలు, నంద్యాల రోడ్డులో రాజేశ్వరరావు పెట్రోల్ బంక్ ఎదురుగా శనివారం ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..విశ్వనాథపురానికి చెందిన మాధవరెడ్డి అనే వ్యకి ఓ మహిళను గత కొంత కాలంగా ఫోన్‌లో వేధిస్తున్నాడు. ఈ విషయమై బాధిత మహిళ, బంధువులైన విష్ణువర్థన్‌రెడ్డి, మరొక వ్యక్తి మాధవరెడ్డిని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడగా వారి బంధువులు చికిత్స నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఇద్దరిని ఒంగోలుకు తరలించారు. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వైద్యశాల వద్దకు వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు.