
బాబు మోసాలను వివరించండి
● మాజీ మంత్రి మేరుగు నాగార్జున
మద్దిపాడు: సూపర్ సిక్స్ అంటూ అబద్ధాలతో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశాడని, బాబు మోసాలను ప్రతి ఒక్కరికీ వివరించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని వెల్లంపల్లిలో శనివారం ఏర్పాటు చేసిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబును రీకాల్ చేసేలా ప్రతి ఒక్కరూ ఆయన మేనిఫెస్టో అమలు చేయకుండా చేసిన మోసాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరించాలని కార్యకర్తలకు సూచించారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత లేదని, అటువంటి మోసగాడు రాష్ట్రానికి అవసరం లేదన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అన్నీ ఇచ్చేశామని బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును నమ్మితే ఆకాశంలో మేఘాలను చూసి కింద నీళ్లు ఒలకబోసుకున్నట్లేనని ఎద్దేవా చేశారు. ప్రజలు ఆయన వాగ్దానాలు విని మళ్లీ మోసపోయామని తలలు బాదుకుంటున్నారన్నారు. ఇటీవల సింగపూర్ వెళ్లిన బాబు ఏపీకి ఎన్నివేల కోట్ల పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బాబును నమ్మితే మోసం గ్యారెంటీ అని అన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట మండల పార్టీ ఉపాధ్యక్షుడు వాక కోటిరెడ్డి, నాగులప్పలపాడు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, కాకర్లపూడి రజిని, పిచ్చిరాజు, నాదెండ్ల మహేష్, కాకర్ల సురేష్, రాయపాటి విల్సన్, కంకణాల సురేష్ అంజమ్మ, సుబ్బారెడ్డి, జయమ్మ, విష్ణు పాల్గొన్నారు.