
రజక వృత్తిదారులకు ఇళ్ల స్థలాలివ్వండి
ఒంగోలు టౌన్: రజక వృత్తిదారులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాయల మాలకొండయ్య డిమాండ్ చేశారు. రజక వృత్తిదారులకు ఇళ్ల స్థలాలు, సామాజిక భద్రత కల్పించాలని కోరుతూ ఈ నెల 25వ తేదీ కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం ఎల్బీజీ భవనంలో సంఘం నాయకులతో కలిసి ధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ జిల్లాలో రజక వృత్తిదారులపై పెత్తందారితనం, కుల వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమకు తగిన ఫలితం ఇవ్వమని అడగడం నేరంగా మారిందని, అలాంటి వారిని గ్రామ బహిష్కరణ చేస్తున్నారని చెప్పారు. గ్రామాల్లో రజక వృత్తి బలహీనపడడంతో అనేక మంది రజకులు పట్టణాలకు వచ్చి అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్లుగా, ఇసీ్త్ర చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. కొంతమంది రజకులు ఇంటిపనివారిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని చెప్పారు. అపార్ట్‌మెంట్ యాజమాన్యాలు కనీస వేతనాలు చెల్లించడానికి సమ్మతించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో ఇళ్లకు వెళ్లి బట్టలుతికి వచ్చే మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేస్తున్నారి ఆగ్రహం వ్యక్తం చేశారు. వృత్తి చెరువులపై భూమి హక్కులు కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని, గ్రామాల్లో శ్రమకు తగిన ఫలితం దక్కేలా చర్యలు తీసుకోవాలని, ఆధునిక ధోబీ ఘాట్లను నిర్మించాలని, ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ధోబీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రజకులకు సామాజిక రక్షణ చట్టాన్ని అమలు చేయాలని, 50 ఏళ్లు నిండిన వారికి సామాజిక పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ధర్నాలో రజకులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు డాక్టర్ కృష్ణయ్య, చీమకుర్తి కోటేశ్వరరావు, ఆవులమంద రమణమ్మ, సర్వేపల్లి యోగమ్మ, మంచికలపాటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.