
మహిళల పాలిట శాపంలా కూటమి ప్రభుత్వం
ఒంగోలు సిటీ:
రాష్ట్రంలో మహిళల పాలిట కూటమి ప్రభుత్వం శాపంలా మారిందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాలు మహిళల జీవితాలను నాశనం చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. మద్యం విక్రయాలు పెంచుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందని, తాజాగా రూ.5 లక్షలు చెల్లించి పర్మిట్ రూంలు పెట్టుకునేలా అనుమతి ఇవ్వడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం షాపుల్లో 33 శాతం తగ్గించి, పర్మిట్ రూంలను రద్దు చేసి, ఊరూరా ఏర్పాటైన 43 వేల బెల్టు షాపులు పూర్తిగా రద్దు చేయడంతో మద్యం వినియోగం తగ్గిందన్నారు. కానీ దీనికి పూర్తి భిన్నంగా కూటమి ప్రభుత్వంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వమే మద్యం విక్రయాలను ప్రోత్సహించడం ద్వారా ప్రజలు ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువ ఆదాయం వస్తుందన్నట్లుగా వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. మద్యం దుకాణం పక్కనే పర్మిట్ రూంలు ఏర్పాటు చేస్తే మద్యపానానికి అడ్డాగా మారతాయన్నారు. గుడి, బడి అని తేడా లేకుండా కూటమి ప్రభుత్వంలో ఎక్కడపడితే అక్కడ షాపులు ఏర్పాటు చేయడంతో మహిళలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. చాలా గ్రామాల్లో మద్యం బాటిళ్లను బెల్టుషాపుల్లో కాకుండా రోడ్డు పక్కన విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా ప్రభుత్వం తన నిర్ణయాలను మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
ఉచిత బస్సు ప్రయాణం అంతా పచ్చిమోసం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంతా పచ్చి మోసం అని విమర్శించారు. మహిళలకు బస్సుల్లో ఫ్రీ అంటూనే కొర్రీలు పెట్టారన్నారు. కేవలం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లోనే మహిళలు ఫ్రీ జర్నీ అని ప్రకటించారనీ, ఈ సర్వీసులన్నీ దూర ప్రాంతాలకు వెళ్లవన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు 12 వేలు ఉంటే మహిళలకు సుమారు 6 వేల బస్సుల్లో మాత్రమే ఫ్రీగా ప్రయాణానికి అనుమతిస్తామనడం పచ్చిమోసం కాదా అని ప్రశ్నించారు. ఆర్డినరీ బస్సులు 30 కిలోమీటర్లు దాటి వెళ్లవనీ, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఒక రూటులో 150 కిలోమీటర్లు మించి వెళ్లవని, అలాంటప్పుడు మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా బస్సుల్లో ఫ్రీ గా ఎలా తిరుగుతారని ప్రశ్నించారు. ఏడాది పాటు హామీలు ఏం ఇవ్వకుండా ఇప్పుడు అరకొరగా ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. పుణ్యక్షేత్రాలైన తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లాలంటే ఈ బస్సుల ద్వారా వెళ్లగలమా అని ప్రశ్నించారు. మాటిచ్చి మోసం చేయడం చంద్రబాబు నైజమన్నారు. కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, మహిళా నాయకులు కనపర్తి గోవిందమ్మ, మేరీకుమారి, వి.వాణి, లక్ష్మీకాంతం, పేరం ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.
కుటుంబాల్లో చిచ్చు పెడుతోన్న మద్యం వినియోగం
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా
అధ్యక్షురాలు దుంపా రమణమ్మ