
మువ్వన్నెల జెండా భుజాన మోస్తూ..
● మహోన్నతుడు సయ్యద్‌షా మౌలానా మొహిద్దీన్ ఖాద్రీ బియాబాని
స్వాతంత్య్ర ఉద్యమంలో సమరయోధులతో కలిసి పోరాటం చేసి ఎన్నో ఏళ్లు సార్లు జైలుకు వెళ్లారు. 500 ఎకరాల భూమిని ప్రభుత్వానికి విరాళం ఇచ్చిన మహోన్నత వ్యక్తి కంభంకు చెందిన సయ్యద్‌షా మౌలానా మొహిద్దీన్ ఖాద్రీ బియాబాని. అప్పటి కర్నూలు జిల్లా ప్రస్తుత ప్రకాశం జిల్లా అయిన కంభంలో 1894లో హజరత్ గౌస్‌పీరా ఖాద్రీ బియాబాని, తల్లి రుఖియాబి దంపతులకు ఆయన జన్మించారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో డిగ్రీ చదివారు. అనంతరం అలీఘర్ యూనివర్శిటీ నుంచి లో ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకున్నారు. విద్యార్థి దశ నుంచే జాకీర్‌హుస్సేన్‌తో కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొనేవారు.
1920లో జాతిపిత మహాత్మా గాంధీ విజయవాడ పర్యటన సమయంలో బియాబాని మహాత్మగాంధీని కలిశారు. ఆ తర్వాత 1923లో అఖిల భారత జాతీయ పతాక సత్యాగ్రహ ఉద్యమంలో ఆయన మువ్వన్నెల జెండా భుజాన మోస్తూ పల్లెపల్లెకు తిరిగారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్‌ను రహస్యంగా కలుసుకున్నందుకు బ్రిటీషు ప్రభుత్వం ఆయన్ను జైళ్లో పెట్టింది. కర్నూలులో స్వాతంత్ర పోరాటాన్ని ప్రారంభించి దేశవ్యాప్త ఉద్యమాల్లో ఆయన స్వాతంత్ర నినాదమై యువకులను ఉత్తేజపరిచేలా పోరాటం చేశారు. దీంతో బ్రిటీష్ ప్రభుత్వం ఆయన్ను అస్సాం రాష్ట్రంలోని గయా జైలులో పెట్టింది. అబుల్ కలాం ఉర్దూ భాషా ప్రావీణ్యం సహాయంతో ఆయన అరబ్బీ బాషలోని ఖురాన్‌లోని భాగాలను ఉర్దూ భాషలోకి అనువదించారు. ఆయన 11 భాషల్లో దిట్ట. స్వాతంత్య్రం అనంతరం మూడుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు.