
మసీదుకు నిప్పు పెట్టిన దుండగులు
– తగులబడిన జానీమాస్‌లు
యర్రగొండపాలెం: గుర్తు తెలియని దుండగులు జామియా మసీదుకు నిప్పు పెట్టిన సంఘటన త్రిపురాంతకం మండలంలోని దూపాడులో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగింది. ఆ మసీదు ఇమాం షేక్.ఇబ్రహీం కథనం ప్రకారం బుధవారం రాత్రి మసీదులో నమాజ్ చేసుకొని 9.30 గంటలకు తాళాలు వేసి ఇంటికి వెళ్లానని, మరుసటి రోజు గురువారం వేకువజామున నమాజ్ చేసుకోవటానికి మసీదు వద్దకు వెళ్లగా ప్రధాన ద్వారం తాళాలు పగులకొట్టి ఉందని, లోపల నమాజ్ చేసుకొనే జానీమాస్‌లు తగులబడి పోయాయని ఆయన తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న దర్శి డీవైఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో త్రిపురాంతకం సీఐ హసాన్, ఎస్సై శివ బసవరాజు హుటాహుటిన దూపాడులోని మసీదును పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు జాగిలం మసీదు పరిసర ప్రాంతాల నుంచి నేరుగా సమీపంలో ఉన్న గుంటూరు–కర్నూలు హైవేరోడ్‌లో ఉన్న బస్టాండ్ వరకు వెళ్లింది. దుండగులు అక్కడి నుంచి బస్సు, లేకుంటే తమ వెంట తెచ్చుకున్న వాహనంలో వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీం వేలి ముద్రలు సేకరించారు. ఈ సంఘటనకు కారకులైన వారిని వెంటనే పట్టుకొని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీవైఎస్పీ తెలిపారు.
మసీదులో జానిమాస్‌లు తగులబెట్టడం దారుణం
మసీదులో నమాజ్ చేసుకునే జానిమాస్‌లు తగులబెట్టడం దారుణమైన సంఘటన అని కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకుడు పఠాన్ హఫీజ్ ఖాన్ ‘సాక్షి’తో అన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న దూపాడు ప్రాంతంలో అశాంతిని నెలకొల్పేందుకు దుండగులు చేసిన దారుణ చర్య సహించరానిదని, ఈ చర్యకు పాల్పడిన నిందితుడిని పట్టుకొని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.