
సిలిండర్ పేలి మామాకోడళ్లకు తీవ్రగాయాలు
ఒంగోలు టౌన్: గ్యాస్ సిలిండర్ పేలి మామాకోడళ్లకు తీవ్రగాయాలైన సంఘటన ఒంగోలు నగరంలోని సత్యనారాయణపురం కృష్ణ మందిరం వద్ద గల ఓ ఇంట్లో గురువారం ఉదయం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న మేకపాటి మాల్యాద్రి కోడలు శీరిష (27) గురువారం ఉదయం నిద్రలేచి ఇంటిముందు ముగ్గు వేసింది. అనంతరం ఇళ్లు తుడిచేందుకు మొదటి అంతస్తులోకి వెళ్లింది. గ్యాస్ వాసన రావడంతో ఏంటో చూద్దామని లైట్ స్విచ్ వేసింది. దాంతో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఆ గదంతా మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్న శీరిష.. భయంతో కాపాడండి అని కేకలు వేస్తూ పక్క గదిలో నిద్రిస్తున్న మాల్యాద్రి వద్దకు వెళ్లి పట్టుకుంది. ఆమె నుంచి విడిపించుకున్న మాల్యాద్రి వెంటనే పక్కనున్న నీటిని ఆమైపె పోసి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె పొట్ట, కాళ్లు కాలిపోయాయి. మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. అయితే, ప్రస్తుతం శిరీష పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఈ ప్రమాదంలో మాల్యాద్రికి రెండు చేతులు పూర్తిగా కాలిపోయాయి. ఆయనను స్థానికంగా ఓ ప్రైవేటు అస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఏడాది క్రితమే శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. సంఘటనపై ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కంభం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. గజ్జల పెద్దపుల్లయ్య(50) భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రి 7.45 నిమిషాల సమయంలో అనంతపురం– అమరావతి హైవే రోడ్డు పై వెళ్తుండగా స్థానిక మధుప్రియ రెస్టారెంట్ సమీపంలో బేస్తవారిపేట వైపు నుంచి కంభం వస్తున్న మినీ లారీ కొట్టడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకువెళ్లడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.