పోరాటయోధులు | - | Sakshi
Sakshi News home page

పోరాటయోధులు

Aug 15 2025 12:23 PM | Updated on Aug 15 2025 12:23 PM

పోరాట

పోరాటయోధులు

ఉద్యమ కెరటం కందుల ఓబులరెడ్డి గర్జించిన వీరుడు కలంతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి..

ఉద్యమ కెరటం కందుల ఓబులరెడ్డి
గర్జించిన వీరుడు
కలంతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి..

పోరాటాలకు పుట్టినిల్లు ప్రకాశం జిల్లా. దేశ స్వాతంత్య్రం కోసం తమ

జీవితాలను త్యాగం చేసిన మహనీయులు ఎందరో. బ్రిటీష్‌ పాలకుల

తూటాలకు ఎదురొడ్డి నిలిచి ప్రజలను చైతన్యవంతులను చేస్తూ తెల్లవారి గుండెల్లో వణుకు పుట్టించారు. పౌరుషానికి పెట్టింది పేరైన ప్రకాశం జిల్లాలో సాగిన ఉద్యమాలు స్వాతంత్య్ర పోరాటంలో దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఎందరో పోరాట యోధుల త్యాగాలు ఫలితమే నేడు మనం పీలుస్తున్న స్వేచ్ఛా వాయువులు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ మహనీయుల త్యాగాలపై సాక్షి కథనం

కంభం/కనిగిరి/మార్కాపురం

కంభం మండలం లింగాపురం గ్రామానికి చెందిన కందుల ఓబులరెడ్డి 1910లో నాగిరెడ్డి, చెన్నమ్మలకు జన్మించారు. బాలగంగాధర తిలక్‌, గాంధీ ఉపన్యాసాలకు ఆకర్షితుడైన ఆయన 1930–33 లలో ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు. స్వరాజ్య ఉద్యమంలో భాగంగా ఖద్దరు ధరించారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు రెండేళ్లూ జైలుశిక్ష అనుభవించారు. ఎన్‌జీ రంగా అనుచరుడైన ఆయన 1934లో నిడుబ్రోలులో రంగా ప్రారంభించిన రైతాంగ విద్యాలయానికి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 1936లో రాష్ట్ర కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా, 1946–51లో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. అనంతరం 1957లో మార్కాపురం శాసనసభకు ఎన్నికయ్యారు. 1963–64లో ఎస్టిమేట్స్‌ కమిటీ చైర్మన్‌గా, 1964–71 మధ్యలో అగ్రికల్చర్‌ యూనివర్శిటీ వ్యవస్థాపక అధ్యక్షునిగా పనిచేశారు. 1972లో యర్రగొండపాలెం నుంచి శాసనసభకు, 1978లో కంభం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికై నీటి పారుదల శాఖా మంత్రిగా, 1982–83 లో ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన వ్యవసాయ రంగానికి చేసిన సేవను ప్రభుత్వం గుర్తించి గుండ్లకమ్మ రిజర్వాయర్‌ ప్రాజెక్టును ఓబులరెడ్డికి అంకితం చేసి ఆయన పేరు పెట్టారు.

సామాన్య ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించిన దరిశి చెంచయ్య చిన్న నాటి నుంచే బ్రిటీష్‌ నిరంకుళ పాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించారు. 1905లో జరిగిన వందేమాతర ఉద్యమం, ఆతర్వాత జరిగిన స్వదేశీ ఉద్యమాలు చెంచయ్య ఆకర్షితులను చేశాయి. బాల గంగాధర్‌ తిలక్‌ ఇచ్చిన స్వదేశీ ఉద్యమానికి మద్దతుగా చెంచయ్య ఒంగోలులో విద్యార్థులతో చేనేత మగ్గాలపై దుస్తులు నేయించి ధరింపచేశారు. 1912లో అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో వ్యవసాయ శాస్త్ర విభాగంలో చేరారు. అక్కడ భారత విప్లవకారులు లాలా హరదయాళ్‌, జితేంద్రనాథ్‌ లహరీ పరిచయమై వారి ప్రసంగాలకు ఆకర్షితులై వారితో కలిసి అమెరికా, కెనడా దేశాల్లోని పంజాబీ సిక్కులు, వ్యవసాయ కార్మికులను సమీకరించి 1913లో గదర్‌ పార్టీని స్థాపించారు. అప్పట్లో దేశభక్తి భావజాలంతో గదర్‌ అనే పత్రికను కూడా ఆయన ప్రచురించారు. భారతదేశానికి ఓడలో ఆయుధాలు తెస్తూ ఓ నమ్మక ద్రోహి సమాచారంతో బ్యాంకాక్‌లో బ్రిటీష్‌ పాలకులకు చిక్కారు. దరిశి చెంచయ్యను లాహోర్‌, మద్రాస్‌, బెంగాల్‌, కలకత్తా, రంగూన్‌ జైళ్లల్లో నాలుగేళ్లు, తమిళనాడు రాష్ట్ర వెళ్తూరు జైళ్లో మరో నాలుగేళ్లు ఉంచారు. సాంఘిక దురాచాలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆ క్రమంలో తన సామాజిక నుంచి వెలివేశారు. దరిశి చెంచయ్య సుభద్రమ్మ అనే మహిళను కులాంతర వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. పరిపూర్ణ అనే గిరిజన బాలికను పెంచుకున్నారు. సీ్త్ర విద్య, హరిజనోద్యమం, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. జన్మస్థలమైన కనిగిరిలో పేదల పక్షాన చెంచయ్య పోరాటాలు చేశారు. కనిగిరికి ఒకటిన్నర కిలోమీటరు దూరంలో టకారిపాలెం సమీపంలో చుట్టుబావి(తాగునీటి బావి) ఉంది. కరువుతో కనీసం గుక్కెడు నీరు దొరక్క పేద మహిళలు తాగునీటి కోసం చుట్టుబావి వద్దకు వెళితే కొంత మంది అగ్రవర్ణాలు తహసీల్దార్‌తో కలిసి వారిని అడ్డుకున్నారు. అప్పట్లో ఆర్యవైశ్యులైన దరిశి చెంచయ్య కుటుంబీకులు పేదల పక్షాన నిలబడి పోరాటం చేసి నీళ్లు ఇప్పించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

ఉద్యమకారులకు మార్కాపురం పుట్టినిల్లు. మహాత్మాగాంధీ అడుగుజాడల్లో స్వాతంత్య్ర పోరాటంలో మార్కాపురానికి చెందిన ఓరుగంటి వెంకట రమణయ్య పాల్గొన్నారు. 1917జూలైలో జన్మించిన ఓరుగంట రమణయ్య 1932లో గాంధీజీ పిలుపు మేరకు విదేశీ వస్తు బహిష్కరణ, పికెటింగ్‌, సత్యాగ్రహ కార్యక్రమాల్లో పాల్గొని పశ్చిమ ప్రకాశంలో ముందుండి ఉద్యమాలను నడిపించారు. స్వరాజ్య సముపార్జనలో రాజకీయ పాఠశాలలో పాల్గొని దివంగత అయ్యదేవర కాలేశ్వరరావు, దేశభక్త కొండా వెంకటప్పయ్యల పిలుపు మేరకు ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. అప్పట్లో బ్రిటీష్‌ పోలీసులు రమణయ్య గృహాన్ని ఎన్నోసార్లు సోదాలు చేశారు. సుమారు 3 దశాబ్దాల పాటు పాత్రికేయునిగా పనిచేశారు. స్వాతంత్య్ర సమరం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రోజుల్లో ఆయన పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొని సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ పత్రికలకు వ్యాసాలు రాశారు. అప్పటి స్వాతంత్రోద్యమ పోరాటాలను బ్రిటీష్‌ పాలకుల దమననీతిని అక్రమ అరెస్టులను పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేశారు. పత్రికలపై బ్రిటీష్‌ ప్రభుత్వం నిషేధం విధిస్తే ఆయన ధైర్యంగా మార్కాపురం, యర్రగొండపాలెం, దోర్నాల, తర్లుపాడు, పెద్దారవీడు, కంభం, గిద్దలూరు తదితర ప్రాంతాలకు పత్రికను పంపి స్వాతంత్య్రోద్యమ విశేషాలను వివరించారు. ఆయన జ్ఞాపకార్థం మార్కాపురం ప్రెస్‌క్లబ్‌లో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు

పోరాటయోధులు 1
1/3

పోరాటయోధులు

పోరాటయోధులు 2
2/3

పోరాటయోధులు

పోరాటయోధులు 3
3/3

పోరాటయోధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement