
తండ్రిని చంపాడని గొంతుకోసి..
● తీవ్ర గాయాలతో వైద్యశాలలో చికిత్స
ముండ్లమూరు(దర్శి): తండ్రి చంపాడని కక్ష పెట్టుకున్న తనయుడు గొంతు కోసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి సుంకరవారిపాలెంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది మే 20న నల్లబోతుల బ్రహ్మయ్య హత్యకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆయన కుమారుడు వీరాంజనేయులు వెంకటేశ్వర్లుపై కక్ష పెట్టుకున్నాడు. ఈ క్రమంలో గ్రామంలో రామాలయం ప్రతిష్ట సందర్భంగా ఆలయం వద్ద భోజనాలు చేసి ఇంటికి వస్తున్న వెంకటేశ్వర్లును వీరాంజనేయులతో పాటు మరో ఇద్దరు కలిసి గొడవ పడ్డారు. ముగ్గురు కలిసి వెంకటేశ్వర్లును కిందపడేసి కత్తితో గొంతు కోసి పలు చోట్ల గాయాలు చేసి వెళ్లిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆటోలో అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచన మేరకు ఒంగోలుకు తరలించారు.
బాలికపై లైంగిక దాడికి యత్నం
దొనకొండ: మండలంలోని దొండపాడు గ్రామానికి చెందిన దొండపాటి బ్రహ్మయ్య అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన శనివారం జరిగింది. ఎస్సై త్యాగరాజు తెలిపిన వివరాల మేరకు..గ్రామానికి చెందిన బ్రహ్మయ్య గ్రామంలో పిల్లలతో కలిసి ఆడుకుంటున్న 8 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు వేసుకున్నాడు.. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే వెళ్లి తలుపులు కొట్టగా తలుపులు తెరుచుకోకపోవడంతో బలంగా తన్నడంతో తెరుచుకున్నాయి.. ఆ సమయంలో బాలిక ఏడుస్తూ ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇది గమనించిన బ్రహ్మయ్య అక్కడ నుంచి పారిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆ మృతదేహం నవీన్‌ది కాదు
కొత్తపట్నం: ఒంగోలు అగ్రహారం గేటు వద్ద రెండు రోజుల క్రితం అనుమానాస్పదంగా లభించిన మృతదేహం ధన్యాసి నవీన్‌ది కాదని పోలీసులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా బోగోలు మండలం చినరాయనిపాలెం గ్రామానికి చెందిన ధన్యాసి నవీన్ బేల్దారీ పని నిమిత్తం కరీంనగర్ వెళ్లి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రజిత అనే యువతితో పరిచయమై ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే ఇటీవల కొత్తపట్నం మండలం మడనూరు గ్రామానికి చెందిన మరో యువతితో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో నవీన్ ఆ యువతి ఇంటికి రాగా బంధువులు మందలించి పంపించివేశారు. అయితే నవీన్ అప్పటి నుంచి కనిపించడం లేదు. దీంతో గత నెల 28వ తేదీన నవీన్ అదృశ్యమైనట్లు తల్లి కొత్తపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీ ఒంగోలు అగ్రహారం గేటు వద్ద మురుగు గుంతలో మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు తాలుకా పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కొత్తపట్నం, తాలుకా పోలీసులు మృతదేహం వద్దకు చేరుకున్నారు. అయితే తల్లి ఫిర్యాదులో ఇచ్చిన గుర్తులు మృతదేహంపై లేకపోవడంతో కొత్తపట్నం ఎస్సై మృతదేహం మాది కాదని తాలుకా పోలీసులకు అప్పగించారు. అయితే తల్లి, బంధువులు మాత్రం మృతదేహం నా కుమారుడిదేనని వాదించడంతో పోస్టుమార్టం అనంతరం వారికి అప్పగించారు. అయితే మృతదేహం దుర్వాసన వస్తుండటంతో ఒంగోలు కమ్మపాలెం శ్మశాన వాటికలోనే దహన సంస్కారాలు చేశారు. అయితే కొత్తపట్నం ఎస్సై సుధాకర్‌బాబు నవీన్ ఫోన్‌కాల్స్ ఆధారంగా కరీంనగర్ వెళ్లి నవీన్ భార్యను విచారించారు. విచారణలో నవీన్ బతికే ఉన్నాడని, సోషల్ మీడియా ద్వారా కాల్స్ కూడా చేస్తున్నట్లు చెప్పింది. దీంతో ఆ మృతదేహం నవీన్‌ది కాదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.