
వసతి.. అధోగతి!
కనిగిరి రూరల్:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వసతి గృహాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయనేందుకు కనిగిరి నియోజకవర్గంలో సంఘటనలే నిదర్శనం. హాస్టళ్ల తనిఖీకి వచ్చిన ప్రజాప్రతినిధులు, కొందరు అధికారుల ఎదటు విద్యార్థులు గోడు వెళ్లబోసుకున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న కనిగిరి మోడల్ స్కూల్ బాలికలు భోజనం నాణ్యంగా లేదని, మెనూ పాటించడం లేదని డీఈఓ, డీవైఈఓకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్ సైతం కలెక్టర్‌కు, ఆ శాఖ ఉన్న తాధికారులకు ఫిర్యాదు చేశారు. మార్చి 8వ తేదీన కనిగిరి బీసీ గురుకుల బాలికల హాస్టల్‌ను తనిఖీ చేసిన మంత్రి సవిత ఎదుట విద్యార్థినులు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. శ్రీదొడ్డు బియ్యం తినలేక పోతున్నాం. మెనూ సరిగా లేదశ్రీని మంత్రికి ఫిర్యాదు చేయగా సన్నబియ్యంతో భోజనం పెడతామని చెప్పి వెళ్లారు. కానీ ఇప్పటి వరకు ఆయా హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించలేదు. ఈనెల 3వ తేదీన ఆదివారం రాత్రి కనిగిరి సమీకృత బాలికల వసతి గృహాన్ని వెలిగండ్ల ఎస్సై కృష్ణ పావని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల, పాఠశాల విద్యార్థినులు చాలా మంది అన్నం తినకుండా అర్థాకలితో ఉన్నట్లు తెలిసింది. ఈనెల 4న సోమవారం అదే సమీకృత హాస్టల్స్‌ను ఎమ్మెల్యే ఉగ్ర తనిఖీ చేయగా వసతులు కల్పించాలని, మెనూ సక్రమంగా లేదని ఫిర్యాదు చేయడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియా వేదికగా బహిర్గతమైంది. ఈ నెల 6వ తేదీన మున్సిపల్ చైర్మన్ గఫార్ బీసీ బాలికల హాస్టల్‌ను తనిఖీ చేయగా అక్కడి విద్యార్థినులు తమకు ఇప్పటి వరకు శానిటరీ ప్యాడ్స్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలన్నీ హాస్టళ్ల నిర్వహణ తీరు, బాలికల సంక్షేమంపై సర్కారు నిర్లక్ష్య వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయి.
తనిఖీలతోనే సమస్యలు కొలిక్కి!
బాలికల హాస్టళ్లలో వెల్ఫేర్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మెనూ పాటించకపోయినా, ఎలా వండినా తప్పనిసరిగా అదే తినాల్సిన పరిస్థితి హాస్టళ్లలో నెలకొంది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు, ఐసీడీఎస్, మహిళా సమాఖ్య సంఘాలు, మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా అధికారులు, సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు తరచూ హాస్టళ్లను తనిఖీ చేస్తే బాలికల సమస్యలు వెలుగులోకి వచ్చి కొంత మేరయినా పరిష్కారయ్యే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర హైకోర్టు కూడా హాస్టళ్లను అధికారులు తనిఖీ చేసిన నివేదికలు తమ ముందు ఉంచాలని ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికై నా పాలకులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

వసతి.. అధోగతి!

వసతి.. అధోగతి!

వసతి.. అధోగతి!