
నిరుపేద కుటుంబాల్లో విషాదం
పెద్దదోర్నాల: మండల పరిధిలోని చిన్నగుడిపాడు చెరువులో శుక్రవారం ఇరువురు బాలురు నీట మునిగి మృత్యవాత పడ్డారన్న సమాచారం జమ్మిదోర్నాల గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృత్యవాతపడ్డ పులుకూరి పవన్‌కుమార్(14) తండ్రి పులుకూరి గాలెయ్య ఏడేళ్ల క్రితమే మృతి చెందగా, చూపు సరిగా లేని తల్లి పులుకూరి రాకాటి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో మండల కేంద్రంలోని సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న కుమారుడు సెలవులకు ఇంటి వచ్చి మృత్యువాతపడటంతో తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. అదే కాలనీలోనే నివాసం ఉంటున్న పులుకూరి అద్భుత కుమార్(16) తండ్రి పెద్దపోలయ్య నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో హమాలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హమాలీ పనిపై వచ్చే సంపాదనతోనే ముగ్గురు పిల్లలను చదివించుకుంటున్నాడు. పెద్ద కుమారుడు నీట మునిగి చనిపోవడంతో పెద్దపోలయ్య, మేరీరాణి దంపతులు హృదయ విదారకంగా రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాతపడటంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా మట్టిని అక్రమంగా తరలించడం కోసం చెరువులో ఇష్టారీతిగా గుంతలు తీసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని మృతి చెందిన చిన్నారుల బంధువులు డిమాండ్ చేశారు.
ఇద్దరు చిన్నారుల ఉసురు తీసిన ఈత సరదా
మట్టి అక్రమ రవాణాకు తీసిన గుంతలే కారణమని
బంధువుల ఆగ్రహం

నిరుపేద కుటుంబాల్లో విషాదం

నిరుపేద కుటుంబాల్లో విషాదం