
యువ ఆంధ్ర ప్రో కబడ్డీ అంపైర్‌గా శ్రావణి
వేటపాలెం: స్థానికి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న జరుబుల శ్రావణి యువ ఆంధ్ర కబడ్డీ సీజన్–1 కి రిఫరీగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆంధ్ర కబడ్డీ రిఫరీస్ బోర్డ్ నుంచి ఎంపికై నట్లు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కబడ్డీలో 30 నేషనల్స్ ఆడి జిల్లా కీర్తి ప్రతిష్టలను శ్రావణి నిలబెట్టారన్నారు. ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌కి ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు వేటపాలెం విద్యార్థులు
వేటపాలెం: రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ సరోజిని శుక్రవారం తెలిపారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా గురువారం బాపట్లలో రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు సెలక్షన్స్ జరిగాయి. ఈ సెలక్షన్స్‌లో హైస్కూల్ చదువుతున్న కె.గాయత్రి, పి.బిందు వాలీబాల్ పోటీలకు, షేక్ నస్రీన్, ఎల్.వైష్ణవి కబడ్డీకి ఎంపికయ్యారని తెలిపారు. గుంటూరులో ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారన్నారు.