
వసతి బరువు!
రక్షణ కరువు..
ఒంగోలు వన్‌టౌన్:
కూటమి ప్రభుత్వ హయాంలో సంక్షేమ వసతి గృహాలు సమస్యలతో కునారిల్లుతున్నాయి. పేద విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ కల్పించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన హాస్టళ్లలో కనీస రక్షణ కరువైంది. చాలా హాస్టళ్లకు ఇన్‌చార్జిలే ఉండడంతో విద్యార్థుల బాగోగులు పట్టించుకునే వారే కరువయ్యారు. సాక్షాత్తూ సంక్షేమశాఖ మంత్రి డోలబాల వీరాంజనేయస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపి నియోజకవర్గం సింగరాయకొండ బాలుర వసతి గృహం అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. జిల్లాలో ఇటీవల పలు హాస్టళ్లలో చోటుచేసుకున్న ఘటనలు ఒక్కసారి పరిశీలిస్తే అక్కడ నెలకొన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అవగతమవుతుంది. చాలా మంది వార్డన్లు హాస్టళ్లకు విజిటింగ్ ప్రొఫెసర్లుగా వచ్చిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బందికి బాధ్యతలు అప్పగించేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 175 వసతి గృహాల్లో 17,250 మంది విద్యార్థులు ఉంటూ చదువుకుంటున్నారు. ఇందులో 24 ఎస్సీ, 18 బీసీ, 10 ఎస్టీ వసతి గృహాలు ఇన్‌చార్జిల పాలనలో నడుస్తున్నాయి.
మంటల్లో విద్యార్థికి గాయాలు
జూలై 25వ తేదీన సింగరాయకొండ బాలుర వసతి గృహం ఆవరణలో విద్యార్థి మంటల్లో పడి గాయపడ్డాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత ముగ్గురు విద్యార్థులు వసతి గృహంలోని ఇసుక కుప్పల వద్దకు వెళ్లారు. హాస్టళ్లలో జరుగుతున్న పనుల కోసం ఉంచిన టర్పెన్‌టైన్ ఆయిల్ బాటిల్‌ను కిందవేసి వెలిగించాడు. ఆ తరువాత ఆ మంటలను చూద్దామని అక్కడికి వేగంగా వచ్చిన మరో విద్యార్థి ప్రమాదవశాత్తూ రాయి తట్టుకుని మంటలపై పడి గాయపడ్డాడు. బాలుడిని తోటి విద్యార్థులు ప్రథమ చికిత్స నిమిత్తం సమీపంలోని పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి 108 వాహనంలో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. హాస్టల్‌కు రెగ్యులర్ వార్డన్ లేరు. ఒంగోలు అంజయ్య రోడ్డులోని కళాశాల వసతి గృహం వార్డన్ ఇక్కడ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇన్‌చార్జి వార్డన్ 35 కిలో మీటర్లు ప్రయాణం చేసి ఇక్కడకు వస్తున్నారు. దీంతో ఈ వసతి గృహ అధికారి ఎక్కడా న్యాయం చేయలేక, సింగరాయకొండకు, ఒంగోలుకు ప్రయాణం చేయడంతోనే సమయం గడుస్తోంది.
పాముకాటు..చికిత్సకు 150 కిలోమీటర్లు
గిద్దలూరు సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహంలో జూలై 23వ తేదీన ఓ విద్యార్థిని పాముకాటు వేసింది. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతనిని వెంటనే గిద్దలూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మార్కాపురం తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణిస్తేగాని విద్యార్థి ప్రాణం దక్కలేదు. స్థానికంగా ఉండే ఆస్పత్రులో అత్యవసర సేవలు సరిగా అందడంలేదనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.
కనీసం వాచ్‌మన్ ఉన్నా సంఘటనను అడ్డుకునే ప్రయత్నం జరిగేది. ఆయనా అందుబాటులో లేడు. మొత్తంగా ఇన్‌చార్జి వార్డన్ల పాలనలో హాస్టల్ విద్యార్థులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రం ఉన్నతాధికారులు వచ్చి హడావుడిచేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో వసతి గృహాల్లో విద్యార్థుల పరిస్థితి దారుణంగా మారుతోంది.
ప్రమాదం అంచున వసతి గృహ విద్యార్థులు ఇన్‌చార్జి వార్డ్డెన్లతో విద్యార్థులకు రక్షణ కరువు 52 వసతి గృహాలకు ఇన్‌చార్జిలే దిక్కు.. పర్యవేక్షణ లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు, వివాదాలు పట్టించుకోని ఉన్నతాధికారులు ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు సంక్షేమశాఖ మంత్రి సొంత జిల్లాలో అస్తవ్యస్తంగా వసతి గృహాలు
ఒంగోలు గిరిజన సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థుల మధ్య కొట్లాట.. చీమకుర్తి బాలికల వసతి గృహంలో బాలిక జడ కత్తిరింపు.. సింగరాయకొండ బాలుర వసతి గృహంలో మంటల్లో పడి విద్యార్థికి గాయాలు.. ఇలా జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో నిత్యం ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉన్నాయి. పేద విద్యార్థులకు అండగా నిలవాల్సిన వసతి గృహాలపై ఉన్నతాధికారుల దగ్గర నుంచి వార్డన్ వరకూ పర్యవేక్షణ కరువైంది. చాలా హాస్టళ్లు ఇన్‌చార్జుల పాలనలో ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. 175 హాస్టళ్లు ఉండగా అందులో 52 హాస్టళ్లకు ఇన్‌చార్జిలే దిక్కు. సంక్షేమశాఖ మంత్రి డోలబాల వీరాంజనేయస్వామి సొంత జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు సంక్షోభ నిలయాలుగా మారాయి.
విద్యార్థి జడ కత్తిరింపు కలకలం...
చీమకుర్తి బాలికల వసతి గృహంలో ఈ నెల 2వ తేదీన ఓ విద్యార్థిని జడ కత్తిరింపు కలకలం రేపింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక శుక్రవారం రాత్రి నిద్రపోయింది. శనివారం ఉదయం నిద్రలేవగానే జడ కత్తిరించి ఉండడంతో విస్తుపోయింది. వెంటనే ఈ విషయాన్ని సహచర విద్యార్థినులతో పాటు వార్డన్‌కు సమాచారం అందించింది. జిల్లాలో సంచలనంగా మారిన ఈ ఘటన సంక్షేమ హాస్టళ్లలో బాలికలకు భద్రత కరువైందన్న దానికి రుజువుగా నిలుస్తోంది. దాదాపు 180 మంది విద్యార్థినులు ఐదు గదుల్లోనే సర్దుకుంటున్నారు. ఇంతమంది బాలికలు ఉన్న హాస్టల్ వార్డన్ ఒంగోలులో ఉండి రోజూ గంటపాటు వచ్చి పోతుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇంత వరకూ దోషులను తేల్చకపోవడం గమనార్హం. ఆడపిల్లలలకు ఇక్కడ రక్షణ కరువైందని బాలికల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన జరిగిందని తెలిసుకున్న మాజీ మంత్రి, సంతనూతలపాడు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున హాస్టల్‌ను సందర్శించి బాలికలకు ధైర్యం చెప్పి వచ్చారు. అలాగే హాస్టల్‌లో బాలికలకు భద్రత కల్పించే విషయంలో ఉన్నతాధికారులు దృష్టిసారించాలని డిమాండ్ చేశారు.
గిరిజన హాస్టల్‌లో డిష్యుం..డిష్యుం..
ఒంగోలు గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఈ నెల 2వ తేదీన కొందరు విద్యార్థులు తన్నుకున్నారు. సీనియర్, జూనియర్ విద్యార్థులతో పాటు బయట నుంచి వచ్చిన వారి మధ్య వివాదం జరిగి కొట్టుకోవడంతో ఇరువురికి గాయాలయ్యాయి. వారిని పక్కనే ఉన్న జీజీహెచ్‌కు తరలించారు. చదువు పూర్తయిన నలుగురు విద్యార్థులు, ఇంటర్న్ షిప్ పేరుతో హాస్టల్‌లో ఉంటున్నారు. అలాగే ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థి అనధికారికంగా ఉంటున్నారు. వీరు రెగ్యులర్‌గా హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులతో గొడవపడ్డారు. అనధికారికంగా ఉంటున్న విద్యార్థులకు తోడుగా బయట నుంచి కొంత మంది వచ్చి హాస్టల్ విద్యార్థులను చితకబాదారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ అనధికారికంగా విద్యార్థులు ఉంటుంటే హాస్టల్ వార్డన్ ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక్కడ కూడా రెగ్యులర్ వార్డన్ లేరు. చీమకుర్తి గురుకులు పాఠశాలలో పనిచేస్తున్నారు. ఆయన అప్పుడప్పుడూ వచ్చి వెళుతుంటారని తెలిసింది.

వసతి బరువు!

వసతి బరువు!

వసతి బరువు!