
పూరీ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి స్వాధీనం
● రైల్వే స్టేషన్లో పోలీసుల తనిఖీలు
ఒంగోలు టౌన్: గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టడంలో భాగంగా పోలీసులు, స్పెషల్ పార్టీ, ఈగల్ టీమ్, ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది సంయుక్తంగా ఒంగోలు రైల్వే స్టేషన్లో శుక్రవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ తో కలిసి రైల్వేస్టేషన్ పరిసరాలు, అనుమానస్పద పార్శిళ్లు, ప్రయాణికుల బ్యాగులను పరిశీలించారు. పూరి ఎక్స్‌ప్రెస్‌లో మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు నిమిత్తం జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. ఎవరైనా గంజాయి, మాదక ద్రవ్యాలను రవాణా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకొంటామని ఎస్పీ ఏఆర్ దామోదర్ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు ఆంజనేయులు, శ్రీకాంత్, మధుసూదన్ రావు, చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.
హజ్ యాత్రికులతో చంద్రబాబు డబుల్ గేమ్
● ఇన్సాఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ సాలార్
ఒంగోలు టౌన్: ఆంధ్రప్రదేశ్ నుంచి పవిత్ర హజ్ యాత్ర చేసే ముస్లింలతో చంద్రబాబు ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతోందని ఇన్సాఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ సాలార్ విమర్శించారు. శుక్రవారం ఆయన ఇస్లాంపేటలో విలేకరులతో మాట్లాడుతూ... గన్నవరం నుంచి మక్కా యాత్రకు వెళ్లిన వారికి మాత్రమే సబ్సిడీ ఇచ్చి హైదరాబాద్, బెంగళూరు నుంచి మక్కా యాత్రకు వెళ్లి వచ్చిన ఆంధ్రప్రదేశ్ హజ్ యాత్రికులకు మొండిచేయి చూపడం చంద్రబాబు ద్వంద్వ వైఖరికి నిదర్శమన్నారు. 2025వ సంవత్సరంలో గన్నవరం నుంచి దరఖాస్తు చేసుకొని హజ్ యాత్ర చేసి వచ్చిన 72 మందికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల సబ్సిడీ ఇచ్చి మొత్తం ముస్లిం సమాజానికి ఏదో పెద్ద మేలు చేసినట్లు ఫోజులు కొడుతోందని ధ్వజమెత్తారు. నిజానికి ఈ ఏడాది రాష్టానికి చెందిన హజ్ యాత్రికులు హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా మక్కాకు వెళ్లి వచ్చారని తెలిపారు. వారికి మాత్రం ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ ఇవ్వలేదన్నారు. గన్నవరం ఎంబర్‌కేషన్ పాయింట్ నుంచి యాత్రికులు దరఖాస్తు చేసుకోవాలంటే ఇతర ప్రాంతాల నుంచి దరఖాస్తు చేసుకునే వారి కంటే ఎక్కువ మొత్తలో వసూలు చేస్తున్నారని చెప్పారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హజ్ యాత్రికులకు తెల్లరేషన్ కార్డు కలిగిన వారికి రూ.60 వేలు, ఇతరులకు రూ.30 వేలు సబ్సిడీ ఇవ్వడమే కాకుండా గన్నవరం ఎంబార్‌కేషన్ పాయింట్ నుంచి వెళ్లే యాత్రికుల నుంచి వసూలు చేసే అదనపు సొమ్మును కూడా తిరిగి చెల్లించిందని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగానే గన్నవరం ఎంబార్‌కేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్ర చేసే ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న అదనపు సొమ్మును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే హజ్ యాత్రికుల ప్రయాణ చార్జీల మధ్య వ్యత్యాసాన్ని సరి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. సమావేశంలో ఇన్సాఫ్ నాయకులు షేక్ ఇమ్రాన్, షేక్ ఆసిఫ్, షేక్ ఫయాజ్ పాల్గొన్నారు.

పూరీ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి స్వాధీనం