
ఓట్లు తీసేసేలా కేంద్ర ప్రభుత్వం కుట్ర
ఒంగోలు టౌన్: బీహార్‌లో దొడ్డిదారి విజయం కోసం దేశ పౌరులను ఓటు హక్కు లేకుండా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిరసిస్తూ దేశ వ్యాప్త పిలుపులో భాగంగా సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం భవనం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీపీఎం జిల్లా నాయకులు చీకటి శ్రీనివాసరావు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా మాబు మాట్లాడుతూ మరో రెండు నెలల్లో బీహార్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాగైనా సరే అధికారం చేపట్టాలని బీజేపీ కుయుక్తులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఓటర్ లిస్టులో డబుల్ ఎంట్రీలు, విదేశీ ఓటర్లు ఉన్నారనే నెపంతో ఎస్‌ఆర్‌ఐ ప్రక్రియ ద్వారా 64 లక్షల ఓట్లను తొలగించిందని చెప్పారు. ఓటు హక్కు కోసం పౌరసత్వం కోసం నిర్దేశించిన డాక్యుమెంట్లను ప్రమాణికంగా పేర్కొనడం దొడ్డిదారిన ఆర్‌ఎస్‌ఎస్ రహస్య ఎజెండాను అమలు చేయడమేనని ధ్వజమెత్తారు. చట్టాల పేరుతో ప్రజల మధ్య విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సీపీఎం న్యూ డెమొక్రసి జిల్లా కార్యదర్శి సీహెచ్ సాగర్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకున్న బీజేపీ దేశంలోని ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగించడం ద్వారా ఓటర్ల హక్కులు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీవి కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల సవరణ చేపట్టడం వెనక పెద్ద కుట్ర దాగుందని విమర్శించారు. బీజేపీ విజయం కోసం ఓట్ల తారుమారుకు పాల్పడుతోందని మండిపడ్డారు. దేశ ప్రజలంతా ఓటర్ల సవరణను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో పి.కల్పన, ఉబ్బా ఆదిలక్ష్మి, జయంతిబాబు, ఎం.రమేష్, పెంచాల హనుమంతరావు, బాలకోటయ్య, టి.రాము, మస్తాన్, దామా శ్రీనివాసరావు, సిహె చ్ లక్ష్మి నారాయణ, బంకా సుబ్బారావు పాల్గొన్నారు.
ప్రకాశం భవనం వద్ద ధర్నా నిర్వహిస్తున్న వామపక్ష నాయకులు