
రెండు గంటల్లోనే బాలికను రక్షించి..
బాకీ డబ్బుల కోసం బాలిక కిడ్నాప్ బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు కావలి– నెల్లూరు మధ్య కిడ్నాపర్ అరెస్డు
ఒంగోలు టౌన్: కిడ్నాప్ అయిన బాలికను కేవలం రెండే గంటల్లో పోలీసులు రక్షించారు. అందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి... చీమకుర్తి మండలం మువ్వవారిపాలెం గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక చీమకుర్తిలోని ఒక ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. బాలిక తండ్రి గతంలో కొంతకాలం తిరుపతిలో నివసించాడు. అప్పుడు వారింటికి దగ్గరలో నివాసం ఉంటున్న ఈశ్వర్‌రెడ్డితో పరిచయమైంది. అతని వద్ద బాలిక తండ్రి అప్పుగా కొంత డబ్బు తీసుకున్నాడు. ఆ డబ్బులు సకాలంలో తిరిగివ్వకపోవడంతో అతడి కూతురిని కిడ్నాప్ చేయాలని ఈశ్వర్‌రెడ్డి పథకం పన్నాడు. అనుకున్నదే తడవుగా శుక్రవారం చీమకుర్తి చేరుకున్నాడు. స్కూల్లో స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్న బాలిక వద్దకు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వచ్చాడు. రా ఇంటికి వెళ్దామని బైక్ ఎక్కమన్నాడు. నిజమేననుకుని ఆ బాలిక బైక్ ఎక్కింది. స్వీట్లు తీసుకుని ఇంటికి వెళదామని నమ్మించి దారి మార్చాడు. మార్గం మధ్యలో బాలిక తండ్రికి ఫోన్ చేసి అప్పుగా తీసుకున్న డబ్బులిస్తేనే నీ కూతుర్ని వదిలేస్తా..లేదంటే చంపేస్తా అంటూ బెదిరించాడు. భయపడిన బాలిక తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దుల వెంట ఉన్న చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. కిడ్నాపర్ ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో బైకు కదలికలను గుర్తించి కిడ్నాపర్‌ను అరెస్టు చేశారు. బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కేవలం 2 గంటల వ్యవధిలోనే బాలికను రక్షించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తల్లిదండ్రులు, విద్యా సంస్థల యాజమాన్యాలు పిల్లల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులతో మాట్లాడే సమయంలో, వారి వాహనాలను ఎక్కమన్నప్పుడు గుడ్డిగా నమ్మవద్దని పిల్లలకు నేర్పించాలని చెప్పారు. బాలికను గుర్తించడంలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ శ్రీనివాసరావు, చీమకుర్తి సీఐ సుబ్బారావు, చీమకుర్తి ఎస్సై కృష్ణయ్య, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పోలీసు అధికారులు, చీమకుర్తి హెచ్‌సీ రాయుడు, కానిస్టేబుళ్లు నాయుడు, అనిల్, విజయ్‌లను ఎస్పీ అభినందించారు.