
భువనాన త్రివర్ణ శోభితం
జిల్లా అంతటా రెపరెపలాడినత్రివర్ణ పతాకం ఒంగోలు పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా స్వాతంత్య్ర దిన వేడుకలు స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు ఘన సత్కారం దేశభక్తి గేయాలకు అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వ స్టాల్స్‌ను సందర్శించిన మంత్రి, కలెక్టర్, ఎస్పీ, జేసీ 465 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసపత్రాలు
గగనాన.. గర్వ పతాకం
నృత్య ప్రదర్శనలో శ్రీ సరస్వతీ కాలేజీ విద్యార్థినులు
ఒంగోలు పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో దేశభక్తి గీతానికి నృత్యం చేస్తున్న గుంటూరు ఆక్స్‌ఫర్డ్ స్కూల్ విద్యార్థులు
వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. దేశభక్తి ఉప్పొంగే పాటలకు విద్యార్థులు చేసిన నృత్యాలకు ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. అత్యద్భుత ప్రతిభ చూపిన డ్రీమ్స్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ బిట్రగుంట విద్యార్థులకు ప్రథమ బహుమతి, అలకూరపాడు జెడ్పీహెచ్‌ఎస్, గుంటూరు ఆక్స్‌ఫర్డ్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ద్వితీయ బహుమతి, సూర్య ఉన్నత పాఠశాల, శ్రీ సరస్వతి పాఠశాల విద్యార్థులకు తృతీయ బహుమతి
అందజేశారు.
ఒంగోలు టౌన్: జిల్లా అంతటా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రైవేటు విద్యా సంస్థల్లో త్రివర్ణపతాకం రెపరెపలాడింది. 79వ స్వాతంత్య్ర దిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నగరంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా స్థాయి వేడుకలు జరిగాయి. ఉప్పొంగిన దేశభక్తితో విద్యార్థులు, యువకులు, నగర ప్రముఖులు, వివిధ శాఖల ఉద్యోగులు తరలివచ్చారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ హాజరయ్యారు. మంత్రి డోలా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్య్రం వచ్చిందని, స్వాతంత్య్ర ఫలాలు ప్రజలందరికీ సమానంగా దక్కేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దులలో కాపలా కాస్తున్న సైనికుల త్యాగాలను ఎంత కొనియాడినా తక్కువేనని చెప్పారు. ఇటీవల పహల్గాం ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు అంజలి ఘటించిన ఆయన.. ఆపరేషన్ సింధూర్‌ను విజయవంతం చేసిన సైనికులకు సెల్యూట్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తోందని తెలిపారు. ఇందుకుగానూ మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేస్తోందని, వనరుల సమర్థ నిర్వహణ కోసం పాటుపడుతోందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో 15 శాతం అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి నెలా ఒకటో తేదీ ఇంటి వద్దనే అందజేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన రోజునే తల్లికి వందనం, ఇటీవలనే దర్శిలో సీఎం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారని, అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు, పీఎం కిసాన్ పథకం కింద రూ.2 వేలు మొత్తం కలిపి రూ.7 వేలను రైతుల ఖాతాల్లో జమచేసినట్లు చెప్పారు. పీ–4 పథకం ద్వారా పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 459 మంది రైతుల నుంచి 927 మెట్రిక్ టన్నుల నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేసినట్లు చెప్పారు. జిల్లా ప్రగతిని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను సుదీర్ఘంగా వివరించారు. డ్రోన్లతో త్రివర్ణ పతకాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆహుతులు ఆశ్చర్యంగా తిలకించారు. ఆకాశంలో రెపరెపలాడుతున్న జాతీయ జెండాలను చూసి చిన్నారులు, విద్యార్థులు కేరింతలు కొట్టారు.
త్యాగధనుల కుటుంబాలకు సన్మానం...
జిల్లాలో 213 మందికిపైగా స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు. వారిలో కొందరు వేడుకలను తిలకించడానికి వచ్చారు. వారితో పాటుగా మాజీ సైనికులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు ప్రకాశం పంతులు మునిమనుమడు సంతోష్ కుమార్, గన్నవరపు వందన కుమారుడు భాస్కర్‌రావు, కరవాది వెంకటేశ్వర్లు కుమార్తె సుబ్బలక్ష్మి, అల్లుడు శేషగిరిరావు, మాటుమడుగు సుబ్రహ్మణ్యం కూతురు నాగసులోచనతో పాటు మరికొందరు మాజీ సైనికులను మంత్రి ఘనంగా సన్మానించారు.
వ్యవసాయ శాఖ శకటానికి ప్రథమ బహుమతి...
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన శకటాలు, స్టాల్స్ ఆకట్టుకున్నాయి. జిల్లా వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖ, నీటి యాజమాన్య శాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖ, ఆర్టీసీ శాఖలు శకటాలను ప్రదర్శించాయి. వీటిలో వ్యవసాయ అనుబంధ శాఖల శకటానికి మొదటి బహుమతి, జిల్లా వైద్యారోగ్య, సంక్షేమ శాఖల శకటాలకు సంయుక్తంగా ద్వితీయ బహుమతి, విద్యా శాఖ శకటానికి తృతీయ బహుమతి ప్రకటించారు. సంబంధిత శాఖల అధికారులకు జ్ఞాపికలు అందజేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు...
జిల్లా వ్యాప్తంగా మొత్తం 465 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీసు అధికారులు, సిబ్బందికి పోలీసు ఉత్తమ సేవా పతకాలు అందజేశారు. 23 మంది జిల్లా అధికారులకు ప్రశంస పత్రాలు అందించారు. డీఆర్వో బీసీహెచ్ చిన ఓబులేసు, స్పెషల్ కలెక్టర్ (ఎల్‌ఏ) కె.శ్రీధర్ రెడ్డి, డ్వామా డీపీ జి.జోసఫ్ కుమార్, యానిమల్ హస్బెండరీ జేడీ డా.బి.రవి, డీఈఓ ఏ.కిరణ్ కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి పద్మశ్రీ, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.వెంకటేశ్వరరావు, స్టెప్ సీఈఓ పి.శ్రీమన్నారాయణ, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.వెంకటేశ్వర్లు, ఏపీసీపీడీసీఎల్ ఎస్‌ఈ కె.వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ డి.బాలశంకరరావు, జిల్లా ట్రెజరీ డీడీ ఏ.జగన్నాథరావు, ప్రొక్యుర్‌మెంట్ జిల్లా మేనేజర్ కె.హరికృష్ణ, ఎస్ అండ్ ఎల్‌ఆర్ ఏడీ గౌస్ బాషా, మెప్మా పీడీ పి.శ్రీహరి, జిల్లా జైలు సూపరింటెండెంట్ పి.వరుణారెడ్డి, డీఆర్డీఏ పీడీ నారాయణ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్.శ్రీనివాసరావు, యోగాంధ్ర ట్రైనర్ జిల్లా మాస్టర్ జి.బాలసుబ్రహ్మణ్యం, ఆయుష్ జిల్లా అధికారి డా.టీవీవీ ఎస్‌ఎంఎస్ భీమ్‌నాథ్, ఎల్‌ఏ ఆర్‌ఆర్ యూనిట్ కంభం ఎస్డీసీ ఎం.వెంకటశివరామిరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ బి.చిరంజీవి, లీడ్ జిల్లా చీఫ్ అధికారి డి.రమేష్ తదితరులకు మంత్రి చేతుల మీదుగా ప్రశంసపత్రాలు అందించారు.
అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయిన ఎమ్మెల్యే...
స్వాతంత్య్ర దిన వేడుకలకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఉదయం 9 గంటలకు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఇతర జిల్లా అధికారులు వేదిక వద్దకు వచ్చారు. 10 గంటలకు వేదిక వద్దకు వచ్చిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కార్యక్రమం పూర్తవక ముందే వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఏపీ మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డా.పెదపూడి విజయకుమార్, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డా.కామేపల్లి సీతారామయ్య, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, డీఆర్‌ఓ చిన ఓబులేసు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, మాజీ సైనికులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.
బిట్రగుంట కేజీబీవీ విద్యార్థినుల నృత్య ప్రదర్శన
భరతమాత వేషధారణలో చిన్నారి

భువనాన త్రివర్ణ శోభితం

భువనాన త్రివర్ణ శోభితం

భువనాన త్రివర్ణ శోభితం

భువనాన త్రివర్ణ శోభితం

భువనాన త్రివర్ణ శోభితం

భువనాన త్రివర్ణ శోభితం

భువనాన త్రివర్ణ శోభితం