
చిరుత దాడితో ఉలిక్కిపడిన జిల్లా
పెద్దదోర్నాల: మండలంలోని చిన్నారుట్ల గిరిజనగూడెంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన చిరుత దాడి సంఘటనతో జిల్లా ఉలిక్కిపడింది. నల్లమల అభయారణ్యం చరిత్రలో తొలిసారి ఓ వన్యప్రాణి మనుషులపై దాడి చేసిన సంఘటనను అటవీశాఖ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. గతంలో తిరుపతి, దిగువమెట్ట తదితర ప్రాంతాల్లో చిరుతలు దాడులు చేసి మనుషులను మట్టుబెట్టిన సంఘటనలు జరిగాయి. అయితే, ఆ సంఘటనలకు, చిన్నారుట్ల గిరిజనగూడెంలో జరిగిన సంఘటనకు చాలా వ్యత్యాసం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి, దిగువమెట్ట ప్రాంతాల్లో జరిగిన సంఘటనలను గమనిస్తే చిరుతల దాడిలో చనిపోయిన వారు అటవీ ప్రాంతంలోనే సంచరిస్తున్నారు. ఆ క్రమంలో అవి దాడులకు పాల్పడ్డాయి. అటవీ ప్రాంతంలో కట్టెలు కొట్టడానికి వెళ్లి కట్టెలు సేకరించే క్రమంలో ఒంగి ఉండటాన్ని బట్టి మనుషులను మరో జంతువులుగా భావించి దాడులకు పాల్పడి ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. అయితే, బుధవారం చిన్నారుట్లగూడెంలో జరిగిన సంఘటనలో తల్లిదండ్రులతో పాటు ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిని నోట కరుచుకున్న సంఘటనతో చిరుతలు ఆహారం కోసం చేసిన దాడిగా భావిస్తున్నారు. నల్లమల పులుల అభయారణ్యం చరిత్రలో తొలిసారి ఓ ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై దాడి చేయడంతో నల్లమలలో నివసించే చెంచు గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. నేరుగా ఇంట్లోకి వెళ్లి నిద్రపోతూ ప్రతిఘటించలేని స్థితిలో ఉన్న మనుషులపై దాడి చేయటాన్ని బట్టి చూస్తే అది మనిషి రక్తానికి అలవాటుపడిన జంతువుగా అనుమానిస్తున్నారు.
చిరుతపులి కదలికలపై నిరంతర నిఘా...
బాలికపై చిరుతపులి దాడి చేసిన సంఘటనపై అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత కదలికలపై దృష్టి సారించారు. గురువారం రాత్రి చిన్నారుట్లగూడేనికి చేరుకున్న ఫారెస్టు రేంజ్ అధికారి హరి గూడెంలోని అన్ని ప్రాంతాలలో ట్రాప్‌డ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు 5 మంది ప్రొడక్షన్ వాచర్లను నియమించి చిరుత కదలికలపై నిఘా ఉంచారు. మనిషి రక్తానికి అలవాటుపడిన వన్యప్రాణులు.. తిరిగి అదే ప్రాంతంలో సంచరించే అవకాశం ఉన్నందున వాటి కదలికలను విశ్లేషించుకుని తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు రేంజి అధికారి తెలిపారు.

చిరుత దాడితో ఉలిక్కిపడిన జిల్లా