
పడిపోతున్న పొగాకు కనిష్ట ధరలు
కొండపి: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో కనిష్ట ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గురువారం నిర్వహించిన వేలంలో పొగాకు కనిష్ట ధర కేజీ రూ.150 పలికింది. శుక్రవారం నిర్వహించిన వేలంలో ఒక్క రోజులోని పది రూపాయలు తగ్గి రూ.140 కు పడిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలం ప్రారంభం సమయంలో కనిష్ట ధర కేజీ రూ.260 ఉండగా తొమ్మిదో రౌండ్ మధ్యలోకి వచ్చేసరికి ప్రారంభ ధరతో పోలిస్తే దాదాపు రూ.120 పడిపోవడంతో రైతులు ఏం చేయాలని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. గత సంవత్సరం వేలంలో వేలం ప్రారంభించిన తర్వాత ధరలు పెరుగుతూ పోతే ఈ సంవత్సరం వేలం ప్రారంభించిన తర్వాత ధరలు తగ్గుతూ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక సంఖ్యలో బేళ్ల తిరస్కరణ ఒకవైపు, గిట్టుబాటు ధర లేక మరొక వైపు రైతులు తీవ్ర ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని పొగాకు రైతులు కోరుతున్నారు.
పొగాకు కనిష్ట ధర కేజీ రూ.140
స్థానిక పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వేలంలో పొగాకు కనిష్టధర కేజీ రూ.140 పలికిందని ఇన్చార్జి వేలం నిర్వహణ అధికారి ఎం.సత్య శ్రీనివాస్ తెలిపారు. క్లస్టర్ పరిధిలోని కామేపల్లి పచ్చవ గ్రామాలకు చెందిన రైతులు 1022 బేళ్లను వేలానికి తీసుకొచ్చారు. అందులో 842 బేళ్లు కొనుగోలయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 180 బేళ్లను తిరస్కరించారు. పొగాకు గరిష్ట ధర కేజీ రూ.282, కనిష్ట ధర కేజీ రూ.140, సరాసరి ధర కేజీ రూ.228.68 గా నమోదైంది. వేలంలో 25 కంపెనీలు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.
టంగుటూరులో..
టంగుటూరు: స్థానిక వేలం కేంద్రంలో రోజురోజుకీ కనిష్ట ధరలు పడిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే 39 మంది కంపెనీ ప్రతినిధులు ఉంటున్నారు. కేవలం పట్టుమని 10 కంపెనీలే పొగాకు కొనుగోలు చేస్తున్నాయి. మిగిలిన కంపెనీ ప్రతినిధులు ఒకటో అరో బేళ్లు కొనుగోలు చేసి సరిపెట్టుకుంటున్నారు. పొగాకు బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని, వేలంలో అన్నీ కంపెనీలు పాల్గొనటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. స్థానిక పొగాకు వేలం కేంద్రంలో నిర్వహించిన వేలంలో శుక్రవారం కనిష్ట ధర రూ.150కి పడిపోయింది. వేలం కేంద్రానికి మల్లవరప్పాడు, శివపురం, గొర్లమిట్ట, మట్టిపాడు గ్రామాలకి చెందిన రైతులు వేలానికి 832 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 628 కొనుగోలు చేయగా, 204 పొగాకు బేళ్లు తిరస్కరించారు. గరిష్ట ధర రూ.281 కాగా, కనిష్ట ధర రూ.150 పలకగా, సరాసరి రూ.220.49 ధర పలికింది. ఈ వేలంలో మొత్తం 39 మంది వ్యాపారులు పాల్గొన్నారని వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు